ఆగని చైనా చొరబాట్లు

19 కిలోమీటర్లు భారత్‌ భూభాగంలో డ్రాగన్‌ దళాలున్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) :
భారత్‌లో చైనా దురాక్రమణ ఆగడం లేదు. చైనా దళాలు భారత భూభాగంలో 19 కిలోమీటర్లు లోపలికి చొచ్చు వచ్చి గుడారాలు వేసినట్లు రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ప్రభుత్వం తెలిపింది. జమ్ము కాశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో ఈ పరిణామం జరిగిందని, పరిస్థితిని యథాతద స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. పరిస్థితిని నిశితంగా గమనించేందుకు భారత దళాలను అక్కడ మొహరించినట్లు రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్‌ శర్మ, పలువురు సీనియర్‌ అధికారులు స్థాయీ సంఘానికి తెలిపారు. లడఖ్‌లోని డెస్సాంగ్‌ సెక్టార్‌లో వాస్తవ సరిస్థితిని తమకు తెలియజేయాల్సిందిగా ఈ కమిటీలోని బీజేపీ సభ్యులు ముక్తార్‌ అబ్బాస్‌ సఖ్వీ, ప్రకాష్‌ జన్‌దేకర్‌ కోరడంతో శర్మ ఇతర అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. లడఖ్‌లోని దౌలత్‌ బేగ్‌ ఓల్డి ప్రాంతంలో గత వారం చైనా దళాల ఆక్రమణ ఘటన చోటు చేసుకుంది. కాగా రక్షణ శాఖ అందించిన ఈ సమాచారం అసంపూర్తిగా ఉన్నదంటూ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కమిటీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. మే 30వ తేదిన  మరోమారు పూర్తి సమాచారంతో రావల్సిందిగా అధికారుకు సూచించారు. ఏప్రిల్‌ 16వ తేదీన భారత దళాలు పహారా విధుల్లో ఉన్నప్పుడు చైనా          విదళాల దూకుడు వ్యవహారం బయటపడింది. చైనా దళాలు ఎల్‌ఏసీ దాటి డెస్బాంగ్‌లో 19 కిలోమీటర్లు ఇవతలికి వచ్చినట్లు కమిటీకి అధికారులు తెలిపారు. దౌత్య మార్గాలు, ప్లాగ్‌ సమావేశాల ద్వారా ఈ సమస్యనుయ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాట్లు వారన్నారు. భారత్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును చైనా వివాదం చేస్తున్నదని, రెండు దేశాల మధ్యా నిర్దిష్ట ఎల్‌ఏసీ విభజన లేదని రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు అన్నారు. లడఖ్‌లో చైనా దళాల దుందుడుకు చర్య అత్యంత తీవ్రమైనదని, అయితే ప్రభుత్వం దీనిని తగిన స్థాయిలో పట్టించుకోవడం లేదని స్థాయీ సంఘం ఛైర్మన్‌ రాజ్‌ బబ్బర్‌కు గురువారమే నఖ్వి, జవ్‌దేకర్‌ లేఖ రాశారు.