ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరుద్యోగ భృతి
కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత
రంగారెడ్డి, నవంబర్ 9 (జనంసాక్షి):
‘వస్తున్నా.. విూకోసం’ పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలపై హావిూల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రైతురుణాల మాఫీ, సబ్సిడీ గ్యాస్ పెంపు వంటి వివిధ హావిూలు ప్రకటించిన బాబు.. శుక్రవారం మరో కొత్త పథకం తీసుకొస్తామన్నారు. తాము
అధికారంలోకి వస్తే.. తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకుండా నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. పాలకులు ప్రజా ద్రోహులుగా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కిరికిరి రెడ్డి అని అంటే బాగుంటుందేమోనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తల్లి, పిల్ల కాంగ్రెస్‌గా విడిపోయాయయని, అవి ఎప్పటికైనా కలిసిపోయేవేనని వైఎస్సార్ సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయమని, ప్రజల తరఫున పోరాడే పార్టీ అని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టానని, ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నారు. బాబు పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా సల్కారీపేట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వెన్నచేడుకు చేరుకున్న ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కష్టాలు తెలుసుకునేందుకు తాను పాదయాత్ర చేపట్టాన్నారు. అధికారం అనుభవిస్తున్న వారు ప్రజలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును కాంగ్రెసొళ్లు దోచుకుతింటున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్టాన్న్రి కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు ప్రోత్సాహం లేక కష్టాలు పడుతున్నారని, వ్యవసాయానికి సరిపడా విద్యుత్, నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అందుకే క్రాప్ హాలీడే ప్రకటిస్తున్నారని చెప్పారు. చేతగాని ప్రభుత్వం వల్లే రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. తాము రుణాలు మాఫీ చేస్తామంటే కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుందని, అందుకే ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నిస్తున్నారని దెప్పిపోడిచారు. ఎలా మాఫీ చేస్తామో చెప్పనని, చేసి చూపిస్తానన్నారు. మహిళల కోసం కొత్త పథకం తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి కాదు.. కిరికిరి రెడ్డి!
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. పాలకులు ప్రజా ద్రోహులుగా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కిరికిరి రెడ్డి అని అంటే బాగుంటుందేమోనని ఎద్దేవా చేశారు. కిరణ్ గత ముఖ్యమంత్రులకన్నా పనికి మాలిన వ్యక్తిగా ఉన్నాడని, ఏ పని చేయడం లేదన్నారు. రాష్ట్రంలో తుపాను వస్తే హైదరాబాద్‌లో కూర్చున్నారని మండిపడ్డారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని రప్పించడంలో విఫలమయ్యారని, రైతులకు
మనోధైర్యం కల్పించడంలో వైఫల్యం చెందారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్టాన్రికి ప్రపంచ స్థాయిలో మంచి పేరు తీసుకువచ్చామని, ఆ కృషి అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందన్నారు. ప్రస్తుత పాలకులు రాష్టాన్న్రి భ్రష్టు పట్టించారని, అవినీతిలో గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టానని, ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నారు.
తల్లి, పిల్ల కాంగ్రెస్ కలిసిపోయేవే!
ముఖ్యమంత్రి పదవి కోసమే తల్లి, పిల్ల కాంగ్రెస్‌గా విడిపోయాయని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసేందుకు తల్లి, పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ప్రజల సొమ్మును వారు ఆ డబ్బుతో ఇప్పుడు పార్టీ పెట్టారని, పత్రికలు, చానళ్లు పెట్టి, టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కలిసి టీడీపీని దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎప్పటికైనా తల్లి, పిల్ల కాంగ్రెస్ కలిసిపోయేవేనన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయం తెలుగుదేశం పార్టీయేనని, పేదల తరఫున పోరాడేది తామేనని చెప్పారు. పేదలకు, బడుగు బలహీనవర్గాలకు అండగా ఉండే టీడీపీకి మద్దతు పలకాలని కోరారు.