. ఆడబిడ్డ బిందెతో రోడ్డెక్కితే సర్పంచ్‌ను సాగనంపుడే
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు
సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలుగా మెదక్ విభజన
మెతుకుసీమపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్, డిసెంబర్ 17(జనంసాక్షి)- మంజీరా నీటిని మెదక్ జిల్లా సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకొనే విధంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖం రావు అన్నారు. మంజీరా నీరు హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాల కోసం వినియోగిస్తున్నందువల్ల ప్రస్తుతం మెదక్ జిల్లాకు సాగునీటి కొరత ఏర్పడుతున్నదన్నారు. కృష్ణా నది నీటిని హైదరాబాద్ తరలించి మంజీరా నీటిని మెదక్ జిల్లాలో వినియోగించాలన్నది తమ లక్ష్యమని సీఎం ప్రకటించారు. మంజీరా నీటిని సింగూరు ప్రాజెక్టులో నిలువ చేసి ఘనపూర్ అనికట్ ద్వారా మెదక్ జిల్లాలో 25 వేల ఎకరాలకు నీరందించే విధంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్ జిల్లా పుల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపుం అనికట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రి అదికారులతో కలిసి ఘనపూర్ అనికట్ పైన, మంజీరా నది పొడవునా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఘనపూర్ అనికట్‌పై సవిూక్ష చేశారు. మంజీరా నది ద్వారా 4.06 టి.ఎం.సి. ల నీటి కేటాయింపు ఘనపూర్ అనికట్‌కు ఉందన్నారు. దీని ద్వారా ధర్మంగా 25వేల ఎకరాలకు సాగునీరు అందాలని, కాని ప్రస్తుతం 12వేల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 25 వేల ఎకరాలకు నీరందించాలని, వీలయితే మరో 5వేల ఎకరాలకు ఎక్కువగానే నీరివ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. అనికట్ కాలువల్లో బాగా పూడిక పేరుకుపోయిందని, దాన్ని తొలిగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలవలన్ని మట్టితోనే ఉన్నందున అవి పూడుకుపోయాయని, కాలువలకు లైనింగ్ వేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని పంపాలని చెప్పారు. అనికట్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగే అవకాశం ఉందని, ఈ ప్రమాదాన్ని నివారించడానికి కరకట్టలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్ధాన్ని కాపాడటానికి తీసుకోవలసిన చర్యలపై ఆధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘనపూం అనికట్ పరిధిలో తాను గతంలో పాద యాత్రలు చేశానని, మంజీరా నదిలో ఇక్కడే పుష్కర స్నానం చేశానని సీఎం గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో ఘనపూం అనికట్ నిర్వహణను విస్మరించారని, కాలువలకు లైనింగ్ వేయకపోవడం వల్ల అవి శిధిలమై పోయాయని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీభూమి ఉంది కానీ చెట్లు లేవని, మొక్కలు పెంచకుంటే భవిష్యత్ తరాలకు నష్టం చేసినవాళ్లమవుతామని అన్నారు. తెలంగాణ హరితవనం కావాలని, వర్షాలు తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు. జలజాలం పని పూర్తయ్యాక ఏ ఆడబిడ్డా బిందెతో నీటికోసం బయటకు వెళ్లకూడదన్నారు. అలా జరిగితే ఆ వూరి సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలన్నారు. నాలుగేళ్లలో ఇంటింటికీ నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమన్నారు. తెలంగాణను గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. హైదరాబాద్‌లో కొంతభూమి అమ్మితే రూ. 25 వేల కోట్లు వస్తాయని, వనరులకు కొదవ లేదని, జిల్లాలకు పట్టిన దరిద్రం వదిలిపోవాలని ఆయన అన్నారు. ఇక ఈ సందర్భంగా మెదక్‌ను మూడు జిల్లాలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై తెరాస శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈరోజు మెదక్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మెదక్‌ను మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలుగా చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకం రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, భూపాల్‌రెడ్డి,ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రెడ్డి, చింతప్రభాకర్, మహిపాల్‌రెడ్డి,జడ్పి చైంపర్సన్ రాజమణి,నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కె.జోషి, ఈ.ఎస్.సి. మురళిధర్, కలెక్టర్ రాహూల్ బొజ్జా, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.