ఆడేది సచినేనా…
వరుసగా మూడో ఇన్నింగ్స్‌లోనూ క్లీన్‌బౌల్డ్
నోటికి పనిచెబుతోన్న విమర్శకులు
బెంగళూర్, సెప్టెంబర్ 3: అతను ప్రపంచ క్రికెట్‌లో ఎవరెస్ట్…. రికార్డులకు కేరాఫ్ అడ్రస్… 23 ఏళ్ళుగా ఇండియన్ క్రికెట్‌కు సేవలందిస్తోన్న వ్యక్తి… ఎవరో ఈ పాటికే అర్థమైఉంటుంది… అతనే సచిన్ టెండూల్కర్…అయితే ఇన్ని రికార్డులను అధిగమించిన మాస్టర్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రత్యర్థి జట్టులో దిగ్గజ బౌలర్లున్నట్టు పరుగులు సాధించేందుకు శ్రమిస్తున్నాడు. హైదరాబాద్ టెస్టులోనూ , ప్రస్తుత బెంగళూర్ టెస్టులోనూ ఇదే పరిస్థితి… విచిత్రమేమిటంటే ఈ రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ అన్ని సందర్భాల్లోనూ క్లీన్‌బౌల్డయ్యాడు. అది కూడా ఒకే టైప్ బంతికి… ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. భారత జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసినప్పటకీ… అందరి దృష్టీ మాత్రం సచిన్‌పైనే ఉంది. కారణంగా సచిన్ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండీ ఇప్పటి వరకూ ఎప్పుడూ కూడా ఇంత చెత్తగా ఔటవలేదని విశ్లేషకుల వాదన. క్రీజులో అతను ఔటైన విధానమే అభిమానులను , ఎక్స్‌పర్ట్స్‌ను ఆశ్చర్యపరిచింది. మూడు ఇన్నింగ్స్‌లలో ఒకే రకమైన బంతికి , ఒకే తరహాలో ఔటయ్యాడు. అందరితో పాటు సచిన్‌కు కాస్త చిరాకొచ్చింది. బెంగళూర్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన మాస్టర్ చిరాకులో బ్యాట్‌ను నేలకేసి కొట్టబోయి మళ్లీ తమాయించుకున్నాడు. ఈ విధంగా ఔటైపోవడానికి ప్రత్యర్ఠి టీమ్‌లో అరివీర భయంకరమైన బౌలర్లు ఎవ్వరూ లేరు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది. సచిన్ ఫుట్‌వర్క్‌లో లోపముందా… అంటే కొంతమంది ఔనని వాదిస్తున్నారు. రెండు దశాబ్ధాలుగా పరుగుల వరద పారిస్తోన్న సచిన్ ఫుట్‌వర్క్‌పై కామెంట్ చేయలేమని మరికొంతమంది వాదన. తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటి వరకూ సొంతగడ్డపై వరుసగా క్లీన్‌బౌల్డవడం ఇదే తొలిసారి. కొన్ని రోజుల క్రితం సునీల్ గవాస్కర్ కూడా సచిన్ ఫుట్‌వర్క్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. విశేషమేమిటంటేయ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు రాహుల్ ద్రావిడ్ కూడా ఇదే రీతిన ఔటవడంతో ఇప్పుడు సచిన్ కెరీర్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ముగిసిపోయింది. ఈ నెలలో టీ ట్వంటీ ప్రపంచకప్ మాత్రమే ఉంది. మాస్టర్ వచ్చే నెలలో జరిగే సిరీస్‌ల కోసమే సిధ్ధమవుతాడు. అప్పటికైనా తన ఫుట్‌వర్క్‌ను మెరుగుపరుచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.