ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేసిన గిరిజనేతరుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.

-గిరిజనేతరుల గుడిశలను తొలిగించే అంతవరకు ఉద్యమిస్తాం.
-ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్.

వెంకటాపురం(నుగూరు), జూలై 26,జనంసాక్షి:-

10 సంవత్సరాల క్రితం ఆదివాసీ కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన రెండున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిన గిరిజనేతరుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక మంగళవారం తహసీల్దార్ అంటి నాగరాజు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.దీని పై తహసీల్దార్ అంటి నాగరాజు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ మండలం అయిన వెంకటాపురం మండల కేంద్రంలో గిరిజనేతరుల భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ,వాటిని కట్టడి చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారని వారు ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతం అయిన వెంకటాపురం మండలంలో కి గిరిజనేతరులు వరద ప్రవాహంలా వచ్చి ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ సంపదను కొల్లగొడుతున్నారని అన్నారు. వలస గిరిజనేతరులు అక్రమ వ్యాపారాలతో పాటు,1/70 చట్ట విరుద్ధంగా భూములను కొనుగోలు చేస్తున్నారని వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీసీ మర్రి గూడెం పంచాయతీ లోని వాడగూడెం జి ,సర్వే నంబర్ 44పి లో సుమారు రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి గతంలో తీసుకెళ్లడం కూడా జరిగిందన్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి గిరిజనేతరుల చేత కబ్జాకు గురి అయిన ఆదివాసీ కమ్యూనిటీ స్థలాన్ని రక్షించాలన్నారు.కబ్జాదారుల గుడిసలను తక్షణమే తొలిగించాలని లేకుంటే ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు కొర్శా నర్సింహమూర్తి, చింత సోమరాజు,రేగా గణేష్,పూనేం చంటి,సిద్దబోయిన సర్వేశ్,కుచింటి చిరంజీవి, ప్రతాప్, తాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.