ఆరోగ్య భారత్‌కు విహెచ్‌పి హెల్త్‌లైన్

నల్లగొండ, అక్టోబర్ 15: భారత దేశ సమగ్రాభివృద్ధి దిశగా పురోగమించేందుకు ఆరోగ్య భారత్ నిర్మాణానికి విహెచ్‌పి దేశ వ్యాప్త కార్యాచరణతో ముందుకెళ్తోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు వైద్యులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. భారత్ దేశ ప్రగతికి పేదల అనారోగ్య సమస్యలు సవాల్‌గా మారాయని, అందుకే ఈ సమస్యను ఎదుర్కొని ఆరోగ్య భారత్ సాధన లక్ష్యంగా విహెచ్‌పి ఇండియా హెల్త్ లైన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దేశంలో 25 కోట్ల మంది రక్తపోటు, 13 కోట్ల మంది డయాబెటిస్, 25 కోట్ల మంది రక్తహీనత, 40 లక్షల మంది కేన్సర్‌తో బాధపడుతున్నారన్నారు. వైద్యం ఖరీదైపోవడంతో పేదలు, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వాల నుండి మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. అందుకే విహెచ్‌పి ఆరోగ్య భారత్ లక్ష్య సాధన సవాళ్లను అధిగమించేందుకు 18602333666 నెంబర్‌తో ఇండియా హెల్త్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ప్రైవేటు వైద్యులను భాగస్వామ్యం చేసుకుని పేదలకు ఉచితంగా చౌకగా వైద్యం అందించే దిశగా విహెచ్‌పి చొరవ తీసుకుంటుందని అన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పలువురు వైద్యులతో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ జిల్లాల ఎంపిక వెనుక ఇతర కారణాలేవీ లేవని, తన పర్యటన కేవలం ఇండియా హెల్త్ లైన్‌తో ఆరోగ్య భారత్ లక్ష్యానికి మాత్రమే పరిమితమన్నారు. మారిన ప్రజల జీవనవిధానం, వృత్తిలో భాగంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు నేటితరం ప్రజలను, చిన్నారులను, మహిళలను ఎక్కువగా అనారోగ్యాల బారిన పడేస్తున్నాయన్నారు. ప్రభుత్వ వైద్య రంగం సామర్ధ్యం దేశంలో 29 శాతం ప్రజలకు మాత్రమే వైద్య సదుపాయాలు అందించగలుగుతుందన్నారు.

తాజావార్తలు