ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలు

జుక్కల్, అక్టోబర్ 10, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని  ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలుగా మారాయి. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రజారవాణా వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిత్యం కొన్నివేల మంది ఆర్టీసి బస్సులోనే రాకపోకలు సాగిస్తారు. నిత్యం వేల మందిని తమ స్థానాలకు ఆర్టీసి సురక్షితంగా చేరుస్తుంది. అలాంటి ఆర్టీసి బస్సులు నిలిపే ప్రాంగణాలు అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. చెత్త చెదారంతో నిండిపోయి, దుర్వాసనతో అధ్వాన్నంగా మారాయి.

గత 30 సంవ త్సరాల క్రితం నియోజక వర్గంలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం, నిజాం సాగర్ మండలకేంద్రాలలో  ప్రయాణికుల సౌకర్యార్థం నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణ ప్రాంగణాలు నిర్మించింది. ప్రస్తుతం ఈ ప్రయాణ ప్రాంగణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.. స్లాబ్ పెచ్చు లూడి పోయాయి. వర్షం వస్తే ఉరుస్తున్నాయి. ప్లాట్ ఫాం అక్కడక్కడ పగిలిపోయి ఇసుక కంకర తేలింది. ప్రయాణికులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు పగిలిపోయాయి. ప్రాంగణంలో సరిపడా విద్యుద్దీపాలు లేవు. ఫ్యాన్ లు అసలే లేవు. ప్రయాణ ప్రాంగణాల ఆవరణలోనే  మూత్ర విసర్జన చేయడంతో బస్టాండ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రయాణీకులు బస్టాండులో నిలబడలేక పోతున్నారు. బస్టాండ్లలో మరుగు దొడ్లు లేక మహిళలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఏ బస్టాండులోను మంచినీటివసతి లేదు. బస్టాండ్లలో కంట్రోలర్ లేరు. కనీసం బస్సుల రాకపోకల వివరాలు తెలిపే బోర్డులు లేవు. బస్సులు వివరాలు తెలియక పోవడంతో ప్రయాణీకులు ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోతున్నారు. దీంతో ఆర్టీసికి నష్టం వాటిల్లుతోంది.
మద్నూర్ బస్టాండ్ లోకి చాలా బస్సులు వెళ్లవు. అక్కడ ఎలాంటి వసతులు లేక పోవడంతో ప్రయాణీకులు కూడా బస్టాండ్ లో నిలబడరు. దత్త ప్రసాద్ శ్రీనివాస్ ఉష్కల్ వార్ జ్ఞాపకార్థం నిర్మించిన మిని బస్టాండ్ లోనే ప్రయాణీకులు ఉంటున్నారు.ఈ బస్టాండులో దాత విద్యుద్దీపాలు, రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
జుక్కల్ నియోజక వర్గం మొత్తంలో కేవలం
బిచ్కుంద బస్టాండులో మాత్రమే మరుగుదొడ్లు పని చేస్తున్నాయి.ఈ మరుగుదొడ్లు కూడా ఏళ్ల నాటివి కావడంతో పగుళ్లు ఏర్పడి కంపు కొడుతున్నాయి. నూతనంగా మరుగు దొడ్లు నిర్మిస్తున్నప్పటికి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. బస్టాండు ఆవరణలో గుంతలు ఉండటంతో వర్షం నీరు నిలుస్తోంది.
ఈ బస్టాండ్ నుండి ఆర్టీసీకి షాప్ లవల్ల మంచి ఆదాయం వస్తున్నప్పటికీ బస్టాండ్ నిర్వహణ పట్ల అధికారులు శ్రద్ద చూపడంలేదు.
జుక్కల్ బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రయాణీకులు బస్టాండ్ లోకి రాకుండా చుట్టూ తాడు కట్టినప్పటికి విధిలేని పరిస్థతులలో ప్రయాణీకులు బస్టాండులోనే కూర్చుంటున్నారు. బస్టాండు ఆవరణ గుంతలమయంగా ఉంది. బస్టాండు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి.ఈ బస్టాండ్ ఆవరణలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు పనులు ఏళ్లతరబడి అర్ధాంతరంగా ఆగిపోయాయి.
పిట్లం బస్టాండులో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లు పనులు నత్తనడకన సాగుతున్నాయి.ఈ బస్టాండు మరమ్మతులకు ప్రభుత్వం 20లక్షల రూపాయలు మంజూరీ చేసినప్పటికీ పనులు మాత్రం సాగడంలేదు.ఈ బస్టాండ్ లో ఉన్న షాప్ లనుండి ఆర్టీసి కి ఆదాయం వస్తున్నప్పటికీ అధికారులు బస్టాండ్ నిర్వహణ లో నిర్లక్ష్యం చేస్తున్నారు.
నిజాం సాగర్ బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు     ఉన్నప్పటికీ పగుళ్లు ఏర్పడటం,నీల్లులేకపోవడంలాంటి సమస్యలతో దుర్వాసన వస్తుంది. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణీకులు ఊపిరిబిగపట్టి ఈమరుగుదొడ్లు వాడుతున్నారు. హైదరాబాద్ వెళ్ళే ప్రతి బస్సు గతంలో వయా నిజాం సాగర్ గుండా వెళ్ళేవి. ప్రస్తుతం చాలా తక్కువ బస్సులు మాత్రమే వెళ్తున్నాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని నిజాం సాగర్ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా ఆవిధంగా బస్సులు నడపాలని కోరుతున్నారు.
టిక్కెట్ రేట్లు విచ్చలవిడిగా పెంచేస్తున్న ఆర్టిసి ప్రయాణీకులకు వసతులు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం లోని మండల కేంద్రాలలోగల ఆర్టిసి ప్రయాణ ప్రాంగాణాలలో ప్రభుత్వం వసతులు కల్పించాలని, నూతనంగా ఏర్పాటైన పెద్ద కొడప్ గల్, డోoగ్లి మండలకేంద్రా లలో అన్ని హంగులతో ప్రయాణ ప్రాంగణాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో ఆర్టిసి బస్సు రాక పోకల వివరాలు తెలిపే బోర్డ్ లు ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు.