ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఆర్టీసీ కార్మికులకు 2017 నుండి వేతన సవరణ చేయకపోవడం చాలా బాధాకరమని ఎస్ డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రాంబాబు అన్నారు.సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులను గమనించి ఆర్టీసీ కార్మికులకు వేతనాలు సవరణ 2017, 2021 చేయాలనీ, 2013 బకాయిలు, సీసీయస్, పిఎఫ్ బకాయిలు చెల్లించాలన్నారు.ఆదివారం
స్థానిక ఎస్ డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో జరిగిన సూర్యాపేట డిపో కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చలేదన్నారు.రోజురోజుకు తీవ్రమైన పని భారం పెరుగుతుందని, దీని వల్ల కార్మికులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు.అరకొర వేతనాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఎస్ బ్ల్యూఎఫ్ రీజినల్ కార్యదర్శి బత్తుల సుధాకర్,డిపో కార్యదర్శి ఉప్పు లక్ష్మయ్య, రీజనల్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నాయకులు పిచ్చయ్య, మర్యాద వెంకన్న ,వీరసోములు తదితరులు పాల్గొన్నారు