ఆర్థిక స్వావలంబన దిశగా చైనా అడుగులు

చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగేస్తూనే తన మూలాల నుంచి తప్పు కోకుండా ప్రపంచంలో దూసుకుపోతోంది. అందుకు అక్కడి కమ్యూనిస్ట్‌ నేతలు కూడా తమవంతుగా ప్రయత్నాలు చేస్తూ దేశం కోసం నిబద్దతగా పనిచేస్తున్నారు. వారి కమిట్‌మెంట్‌ వల్ల దేశం ఇప్పడు అమెరికాను శాసించేస్థాయికి చేరుకుంటోంది. అందుకే  పదేళ్ల క్రితమే అధికారం నుంచి వైదొలగిన  మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ (86) కమ్యూనిస్ట్‌ పార్టీకి ఇంకా అనధికార అధిపతిగా కొనసాగుతూ  తెర వెనక నుంచి చక్రం తిప్పుతున్నారు.  పాతకు కొత్తకు వారధిగా పనిచేస్తున్నారు. చైనా  కమ్యూనిస్ట్‌  పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జింగ్‌పింగ్‌ నియమితులవ్వడం చూస్తే వారు ఎంత ప్రణాళికా బద్దంగా ముందుకు పోతున్నారో అర్థం చేసుకోవచ్చు.  చైనా అధ్యక్షుడు హు జింటావో స్థానంలో జీ జింగ్‌పింగ్‌ను నియమించినట్లు పార్టీ ప్రకటించాక దాని దూరదృష్టి, దారశనికతను అర్థం చేసుకోవచ్చు.   కమ్యూనిస్ట్‌ పార్టీ కొత్త అధిపతిగా, కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన  జీ జింగ్‌పింగ్‌ (59), కొత్త ప్రధానిగా  లీ కెకింగ్‌ (57) సహా ప్రముఖనేతలందరికీ కేంద్ర కమిటీలో స్థానం దక్కింది. దీంతో చైనాలో కొత్త శకం ఆరంభమయ్యింది. ఆర్థిక సరళీకరణల వైపు ప్రపంచం పరుగుపెడుతున్న దశలో వీరిద్దరూ సారథ్యం వహించడం చైనాలో కొత్తశకానికి నాందిగా భావిస్తున్నారు.  కొత్త కేంద్ర కమిటీలో దాదాపు 50 శాతం మంది కొత్త వారే. వీరి రాకతో ఇక నుంచి అభివృద్ధిలో శాస్త్రీయ దృక్పథం కూడా పార్టీ కార్యాచరణలో భాగంగా ఉంటుంది. ఈ కొత్త సిద్దాంతానికి రూపకర్త.. హు జింటావో.  కరడుగట్టిన మార్కిస్ట్‌  విధానాల నుంచి చినాను క్రమంగా బయటపడేస్తూ సంస్కరణలను అమలు చేయడంలో హు జింటావో కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలో గత పదేళ్లలో చైనా ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసి బలమైన ఆర్థికశక్తిగా దేశాన్ని తీర్చిదిద్దారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చడంలోనూ ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. వారం రోజులపాటు అట్టహాసంగా జరిగిన  కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో ఇకవిూదట దేశాన్ని నడిపించే అయిదోతరం నేతల ముఖచిత్రం ఆవిష్కృతమైంది. అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ పదవీ వారసుడిగా 2002లో తెరపైకి వచ్చిన హు జింటావో- దశాబ్ద కాలంపాటు దేశాన్ని  ప్రగతి పథంలో పరుగులెత్తించి నిష్కమ్రిస్తున్నారు. అయిదోతరం నేతగా జి జింగ్‌ పింగ్‌ తెరపైకి వచ్చారు. రెండేళ్ల క్రితం వజ్రోత్సవ వేడుకల నాటికే జపాన్‌ను తలదన్ని అమెరికా తరవాత రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిన చైనా విజయగాథ స్ఫూర్తిమంతం. మావో జెడాంగ్‌ చేసిన సామ్యవాద ప్రయోగాలతో కమిలి, కుమిలి దాదాపు మూడు దశాబ్దాలు కిందువిూదులైన జనచైనా, డెంగ్‌ జియావో పింగ్‌ నూతన ఆలోచనా విధానంతో కొత్త ఊపిరి తీసుకొంది. 1979లో మొట్టమొదటిసారిగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేసిన డెంగ్‌, సామ్యవాద మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాదులే వేశారు. పెట్టుబడులతో వచ్చే బహుళజాతి కోడిపెట్టలేవైనా, తమ గడ్డవిూదే ప్రగతి గుడ్లుపెట్టి, ఉపాధి అవకాశాల్ని పొదిగే విధంగా సకల జాగ్రత్తలూ తీసుకొన్నారు. 20వేల కోట్ల డాలర్ల వాణిజ్య మిగులుతో అగ్రరాజ్యం అమెరికాకే ముచ్చెమటలు పట్టించింది.  అవినీతిని కట్టడి చేయకుంటే పార్టీతోపాటు దేశం పుట్టీ మునుగుతుందన్న హు జింటావో హెచ్చరిక పూర్తిగా అర్థవంతం. దాన్ని మన్నిస్తున్న రీతిగా ‘వృత్తిగత సామర్థ్యంతోపాటు, నీతిమంతుల్నే తన కార్యవర్గ శ్రేణుల్లోకి ఎంచుకోవాలనీ, నైతికతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనీ తాజాగా పార్టీ నిబంధనావళిలో సవరణ చెయ్యడం గమనార్హం. రెండేళ్ల క్రితంనాటి స్థూల దేశీయోత్పత్తిని, పట్టణ గ్రావిూణుల తలసరి ఆదాయాల్ని 2020 నాటికి రెట్టింపు చెయ్యాలని కమ్యూనిస్టు మహాసభ సంకల్పం చెప్పుకొంది. సౌభాగ్యవంతమైన సమాజం గల అందమైన చైనాను ఆవిష్కరించడమే లక్ష్యమంటున్న మహాసభల తీర్మానం సాకారమైతే అభివృద్ధి చెందిన దేశాల సరసన బీజింగ్‌ సగర్వంగా నిలవగలుగుతుంది. ఆర్థికంగా చైనా సాధించిన విజయాలు 50కోట్ల మందిని దారిద్యర్రేఖ దాటించాయంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని భారీ కర్మాగారాలపైనే దృష్టి కేంద్రీకరించడం మాని, అభివృద్ధి, ఉద్యోగ కల్పనలకు వూతమివ్వగలిగే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహమిచ్చేలా భావి ప్రగతి నమూనా మారాల్సి ఉందంటున్నారు. పట్టణ గ్రావిూణ ప్రాంతాల్లో ఆదాయాల అంతరం అంతకంతకు పెరగడం, పట్టణాలకు వలసలు ముమ్మరించడం సామాజిక సంక్షోభానికి అంటుకడుతోంది.  అసమానతల కుంపటిగా ఉన్న ఇంటిని చక్కదిద్దుకొంటూ రెట్టింపు ప్రగతి లక్ష్యాలను చినా చేరుకోవాలంటే- అవినీతిని మరింత సమర్థంగా అదుపుచెయ్యడం తప్పనిసరి. వృద్ధిరేటుతో దేశాన్ని కదం తొక్కించిన హు జింటావో, అవినీతిని దునుమాడే బాధ్యతను రేపటి తరానికి అప్పగించి వెళుతున్నారు.