డిప్లొమా కోర్సు ఇంటర్‌కు సమానమే’ ` తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

డిప్లొమా కోర్సు ఇంటర్‌కు సమానమే’
` తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్‌(జనంసాక్షి):ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థి ఇంటర్మీడియట్‌ అర్హత లేదంటూ డీఈడీ కోర్సు కౌన్సెలింగ్‌లో నిరాకరణ – డిప్లొమా కోర్సులు ఇంటర్మీడియట్‌కు సమానమేనని స్పష్టం చేసిన హైకోర్టుత్వరగా ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు డిప్లొమా కోర్సులు చేస్తుంటారు. అయితే ఇది ఇంటర్మీడియట్‌కు సమానమా? కాదా?అనే అనుమానం చాలా మందికి కలుగుతోంది. తాజాగా ఇంటర్మీడియట్‌కు డిప్లొమా కోర్సు సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. సాంకేతిక విద్యాబోర్డు (బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌)తో పాటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాయని వెల్లడిరచింది. అయినప్పటికీ అర్హత లేదంటూ డీఈఈ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల అడ్మిషన్‌ను నిరాకరించడాన్ని తప్పుపట్టింది. వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జిల్లాకు చెందిన కంపెల హరీశ్‌ ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. అయితే తనకు ఇంటర్మీడియట్‌ అర్హత లేదంటూ డీఈఈ కోర్సులో కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. దీనిని సవాల్‌ చేస్తూ హరీశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పానుగంటి విజయకుమార్‌ వాదనలు వినిపించారు. డిప్లొమా కోర్సు ఇంటర్మీడియట్‌కు సమానమేనని 2001లో ప్రభుత్వం జీవో 112 జారీ చేసింది తెలిపారు. పిటిషనర్‌ డీఈఈ కోర్సు ఎంట్రన్స్‌ పరీక్షలో ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌?కు వెళితే ఇంటర్మీడియట్‌ కోర్సు లేదంటూ అతనిని నిరాకరించారని వివరించారు.ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ డీఈఈ కోర్సు పూర్తి చేశాక, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుకు ఎంపిక కావచ్చని, అలాంటప్పుడు తెలుగు, ఆంగ్ల భాషల సబ్జెక్టులు అవసరమన్నారు. డిప్లొమాలో అవి ఉండవని, అందువల్ల ఆ అభ్యర్థికి అర్హత లేదని వివరించారు.ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, డిప్లొమా జారీ చేసిన సాంకేతిక బోర్డు అది ఇంటర్మీడియట్‌కు సమానమైన కోర్సుగా పేర్కొన్నందున ఇంటర్‌ అర్హత లేదని ప్రవేశం నిరాకరించడానికి వీలుకాదని స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షలో అర్హత పొందితే అడ్మిషన్‌ ఇవ్వాలని కన్వీనర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.గతేడాదితో పోల్చితే మూడు రెట్లు : రాష్ట్రంలో డీఈడీ కోర్సునకు అభ్యర్థుల నుంచి డిమాండ్‌? పెరుగుతోంది. రెండేళ్ల క్రితం డీఈడీ చదివి టెట్‌? పాసైతే ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాలకు సులభంగా ఎంపిక అవ్వొచ్చనే అభిప్రాయం ఉండేది. గతేడాది డీఈఈ సెట్‌కు 14,036 దరఖాస్తుల చేయగా, ఈ సంవత్సరం పోటీపడే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగి 43,615 కు చేరుకుంది. దానిలో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 33,821.