ఆర్ గార్లపాడు బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో ???

 

ప్రజల కష్టాలు తీరేది ఎన్నడో

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 7 : కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి అధికారుల అలసత్వంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు సామెతగా మారింది. మండల పరిధిలోని రాజశ్రీ గార్లపాడు సమీపంలో ఉన్న వాగు బ్రిడ్జి నిర్మాణం చేందుకు 2017 సంవత్సరంలో టెండర్లు పిలిచినప్పటికీ 2019 లో అరకొర పనులు ప్రారంభించి నేటి వరకు పనులు ఆగిపోవడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో ప్రజల కష్టాలు తీరేది ఎన్నడో అన్నట్టుగా పరిస్థితి తయారయిందని వాహనాలుదారులు అపోయారు. రాజశ్రీ గార్లపాడు, పల్లెపాడు, చండూరు, మారమునగాల, బోరవెల్లి, ధర్మవరం, ప్రాగటూరు తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వర్షం వచ్చినాప్పుడల్లా ప్రతి సంవత్సరం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావలసిన దుస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల కింద కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతే కాకుండా వర్షం నిలిచి తర్వాత కూడా వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొందని వివిధ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ప్రజల ఇక్కట్లును రాజకీయ నాయకుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు దెబ్బతినడంతో బుధవారం ఆర్ గార్లపాడు మీదుగా బి. వీరాపురం గ్రామానికి రేషన్ బియ్యం లోడుతో వెళ్లుతున్న లారీ, బొలెరో వాహనం ఎదురెదురుగా వచ్చి వాగులో కూరుకుపోయి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.