ఆలేరు సాయిబాబా ఆలయంలో చోరీ
వెండి,బంగారు అభరణాలతో పాటు నగదు లూటీ
యాదాద్రి భువనగిరి,జూలై27(జనంసాక్షి ): ఆలేరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. సాయిబాబా దేవస్థానంలో
వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్` వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 35 కిలోల వెండి, 5 తులాల బంగారు చైను, 45 వేల విలువగల యూఎస్ డాలర్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఆభరణాలతో పాటు హుండీలోని డబ్బు పోయినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయం తలుపులు పగులగొట్టిన దుండగలు గుడిలోకి ప్రవేశించారు. హుండీని కూడా పగులగొట్టి అందులో ఉన్న డబ్బును, స్వామి వారి ఆభరణాలను చోరీ చేశారు. మొత్తం 5తులాల బంగారం, 35కిలోల వెండి ఆభరణాలతో పాటుగా రూ.45వేల విలువగల యూఎస్ డాలర్లు హుండీలో ఉన్న డబ్బు పోయినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం గుడికి వెళ్లిన అర్చకుడు ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు..సంఘటన స్థలానికి చేరుకున్న ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.