ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
ఈ నెల 9న హైదరాబాద్ హయత్ నగర్ లోని ధనుంజయ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగే సేవాలాల్ సేన 8వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ శంకర్ నాయక్, బానోతు బాలు నాయక్ పిలుపునిచ్చారు.ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవం కరపత్రాలను జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10శాతం గిరిజన రిజర్వేషన్ పెంపు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు.జనాభా దామాషా ప్రకారం వెంటనే 10శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అన్నారు.సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి, జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు 10 లక్షల రూపాయలను కేటాయించాలన్నారు.గిరిజన బంధు ప్రకటించి గిరిజనులను ఆర్ధికంగా బలోపేతం చేయాలన్నారు.ప్రత్యేక ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేసి గిరిజనులు ఆర్ధిక పరిపక్వతను పొందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ శివరాం నాయక్ , జిల్లా కార్యదర్శి ధరావత్ సేవ్యా నాయక్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు ధరావత్ కృష్ణ నాయక్, సేవాలాల్ సేన చివ్వేంల మండల అధ్యక్షుడు భూక్యా నాగు నాయక్ , రాష్ట్ర కమిటీ సభ్యులు ధరావత్ చాంపు లాల్ నాయక్, ధరావత్ పవన్ నాయక్, రాంచంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.