ఆ జలం ఆంధ్రోళ్ల గరళం మన సాగర్‌లో కాలకూట విషం కలిపిందెవరు?
సమైక్య కుట్రలకు సాగర్ జలం విషతుల్యం
నాలాల ద్వారా వ్యర్థ రసాయనాల చేరిక
తాగునీటి కల చెదిరి మురుగునీటి వాసన
‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
హైదరాబాద్, నవంబర్ 24 (జనంసాక్షి) : అది నగరానికే మణిహారం.. కానీ.. ఇప్పుడది ఓ కాలుష్యకాసారం.. అది ఒకప్పుడు తాగునీటి తటాకం.. ఇప్పుడు విషాన్ని చిమ్ముతున్న సాగరం.. అదే మన హైదరాబాద్ నడిబొడ్డున వెలసిన హుస్సేన్ సాగర్. ఈ జలాశయం ఇప్పుడు పూర్తిగా విషతుల్యమై.. మురుగుకంపును వెదజల్లుతోంది.. అటుగా వెళ్లే ప్రజల ముక్కుపుటాలను అదరగొడుతోంది.. దీనికి ముమ్మాటికీ సమైక్య పాలకులదే పాపం. 60 ఏళ్ల వలసవాద పాలనలో సాగర్ జలాశయం సంరక్షణకు నోచలేదు. ఫలితంగా ఆ జలాశయం మొత్తం కాలకూటవిషమై.. నీటిలో కాలుపెడితే కాటేస్తానంటోంది. ఈ నేపథ్యంలో.. సాగర్ జలాశయాన్ని ప్రక్షాళన చేసేందుకు ఎట్టకేలకు టిసర్కార్ నడుంబిగించింది. కాలుష్యాన్ని కడిగేసి.. హుస్సేన్ సాగర్‌కు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. దీనిపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది.
హుస్సేన్ సాగర్ నిర్మాణం.. నేపథ్యం…
1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో ఆయన అల్లుడైన హజ్రత్ హుస్సేన్ షా వలీ పర్యవేక్షణలో హుస్సేన్ సాగర్ నిర్మితమైంది. దీని నిర్మాణం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతులో చెరువు నిర్మించారు. దీనికి ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టేందుకు కుతుబ్‌షా భావించాడు. కానీ.. అప్పట్లో హుస్సేన్ పేరు ప్రజల్లో చాలా ప్రాచుర్యం ఉంది. దీనికారణంగా ప్రజలందరూ హుస్సేన్ సాగర్ చెరువుగా పిలుచుకుంటున్నారు. దీన్ని గమనించిన కుతుబ్‌షా చెరువుల ఆధరణను చూసి వెంటనే తన పేరుమీద గోల్కొండకు 16 మైళ్ల దూరంలో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మించుకున్నాడు. అయితే.. ఈ హుస్సేన్ సాగర్ చెరువు తవ్వకం పూర్తైనా ఇందులోకి నీరు రాకపోవడంతో దీనికి మూసినదిని అనుసంధానం చేశారు. దాంతో హుస్సేన్ సాగర్‌లోకి పుష్కలంగా నీరొచ్చి చేరేది. అప్పట్లో ఈ చెరువును నగర ప్రజలు తాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకునేవారు.
ఆంధ్రోళ్ల రాక.. హుస్సేన్ సాగర్‌కు శాపం…
నైజాం పాలన తర్వాత.. ఆంధ్రప్రేదేశ్ అవతరించాక సీమాంధ్రులు తెలంగాణకు వలసలు మొదలెట్టారు. వీరు రావడంతోనే హైదరాబాద్‌పై కన్నేశారు. చుట్టుపక్కల పరిశ్రమలు స్థాపించి పట్టుసాధించారు. ఆ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థరసాయనాలను నేరుగా నాలాల ద్వారా హుస్సేన్ సాగర్‌లోకి వదులుతున్నారు. సాగర్‌లోని జలాలను బయటికి పంపేందుకు అవకాశం లేకపోవడంతో వచ్చిన వ్యర్థాలన్నీ అలాగే ఉండిపోయాయి. అసలు బయటి నుంచి కూడా మూసినది నుంచి రావాల్సిన జలాలు కూడా సాగర్‌లోకి రావడం తక్కువైంది. అందుకున్న దారులన్నింటినీ సీమాంధ్రులు మూసేశారు. నాలాలను కబ్జాచేసి రియల్ ఎస్టేట్ దందా నిర్వహించారు. ఈ పాపానికి కేవలం మురుగునీరు మాత్రమే సాగర్ జలాశయంలోకి వస్తోంది. దానివల్ల ఒకప్పుడు తాగునీటి వనరుగా ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు కాలకూటవిషమైంది. జలాశయంలో ఏ ప్రాణీ బతకలేనంత కాలుష్యం నిండిపోయింది. అలాగే ప్రతీ సంవత్సరం వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడం వల్ల సాగర్ జలాలు మరింత కలుషితం అయ్యాయి.
సాగర్ జలాల పరిరక్షణకు చర్యలు శూన్యం…
దశాబ్దాల పాటు సాగిన సీమాంధ్రుల పాలనలో హుస్సేన్ జలాల పరిరక్షణకు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. ఆ పాపానికే నేడు సాగర్ మురుగునీటి సరస్సుగా మారింది. నగరంలోని ప్రధాన నాలాలు అయిన జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతాల నుంచి శుద్ధిచేయని వ్యర్థరసాయనాలతోపాటు మురుగునీరు కూడా కూకట్‌పల్లి నాలాలో కలిసి సాగర్‌కు చేరుతున్నా.. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్న పాపానపోలేదు సమైక్య ప్రభుత్వాలు. మరీముఖ్యంగా మెదక్ జిల్లా పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక వాడల నుంచి అత్యంత ప్రమాదకరమైన, వ్యర్థ రసాయనాలు సాగర్‌లోకి పెద్దమొత్తంలో వచ్చిచేరుతున్నాయి. సాగర్‌లో జలచరాలు బతకాలంటే.. లీటర్ నీటిలో కెమికల్ శాతం 50 మిల్లీ గ్రాముల్లోపు ఉండాలి. అందుకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. కానీ.. ప్రస్తుతం సాగర్ నీటిలో కెమికల్ శాతం 134 నుంచి 350 మిల్లీ గ్రాముల వరకు ఉంది. అయినా ప్రభుత్వం ఒక్కసారైనా స్పందించలేదు. కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలపై ఏనాడూ దృష్టిపెట్టలేదు. కనీసం నాలాల నుంచి వచ్చే మురుగునీటిని అరికట్టేందుకైనా చర్యలు తీసుకోలేదు. అంటే ఈ ప్రభుత్వాలకు తెలంగాణలో ఉన్న చెరువులు, జలాశయాలను రక్షించేందుకు ఏపాటి శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతోంది.
ఫార్మా కంపెనీల వ్యర్థరసాయనాలు నేరుగా సాగర్‌లోకి…
హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వివిధ రకాల మందుల తయారీ పరిశ్రమలు ఇక్కడ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తున్నాయి. ఇక్కడ మందుల తయారీ ఎంతగా ఉందంటే.. ప్రపంచానికి కావాల్సిన మందులలో 70 శాతం ఔషధాలు ఈ పటాన్‌చెరు పారిశ్రామికవాడలోనే తయారవుతాయి. ఈ కంపెనీల నుంచి అత్యంత విషపూరితమైన వ్యర్థ రసాయన జలాలు నేరుగా నాలాల ద్వారా హుస్సేన్ సాగర్‌లోకి చేరుతున్నాయి. సాగర్‌లోకి వస్తున్న వ్యర్థ రసాయనాల్లో ఎక్కువ భాగం పటాన్‌చెరులోని ఫార్మాకంపెనీల వ్యర్థ రసాయన జలాలు కావడం గమనార్హం. తద్వారా హుస్సేన్ సాగర్ నీళ్లన్నీ కాలకూటవిషంగా మారిపోయాయి.
జపాన్ నిధులిస్తానన్నా.. స్పందించని సమైక్య ప్రభుత్వం…
రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని నివారించేందుకు 2006లో జపాన్‌లోని అంతర్జాతీయ సహకార బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఓ పెద్ద ప్రాజెక్టును పదేళ్లపాటు నిర్వహించాలని నిర్ణయించాయి. అందుకు రూ.310 కోట్లు ఖర్చుచేయాలని అంగీకరించాయి. ఇందుకు సంబంధించి జపాన్ బ్యాంకు ప్రతినిధులు ప్రాథమిక సర్వే కూడా నిర్వహించారు. కానీ.. ప్రభుత్వం అసమర్థత వల్ల వివిధ ప్రభుత్వ, నగర పాలక సంస్థలు ఈ అంశంపట్ల తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదు. ఫలితంగా అక్కడి నుంచి నిధులు రాక అనుకున్న లక్ష్యం నీరుగారిపోయింది.
ఎట్టకేలకు సాగర్ ప్రక్షాళనకు టి సర్కార్ నిర్ణయం…
సమైక్య పాలనలో కుళ్లికంపుగొడుతున్న సాగర్ జలాలను కొత్త రాష్ట్రం వచ్చాక పరిశుభ్రం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సాగర్ మురికిని వదలగొట్టేందుకు ఎన్ని నిధులైనా సరే ఖర్చుచేస్తానని ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. సాగర్ జలాన్ని శుద్ధజలంగా మారుస్తానని ప్రతినబూనారు. అంతేకాదు.. సాగర్ చుట్టూ ఆకాశహార్మ్యాలు నిర్మించి హైదరాబాద్‌ను ప్రపంచానికే తలమానికంగా తయారు చేస్తానని భరోసా ఇస్తున్నారు. ఏదేమైనా సొంత రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రోళ్ల జిడ్డును ఒక్కొక్కటిగా వదలగొట్టేందుకు ఆచితూచి అడుగులేస్తున్నారు. అందులో భాగమే ఈ హుస్సేన్ సాగర్ జలాశయం ప్రక్షాళన కార్యక్రమం. ఏదేమైనా ఇది శుభపరిణామం. సాగర్ ప్రక్షాళన తెెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక సూచిక కావాలని జనంసాక్షి దినపత్రిక మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.