ఆ మందుపై మీకు పేటెంట్‌ లేదు

నోవార్టిస్‌ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) :
క్యాన్సర్‌ మందుపై మీకు పేటెంట్‌ లేదు, మీ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించబోదంటూ సుప్రీం కోర్టు నోవార్టిస్‌ పిటషన్‌ను తోసిపుచ్చింది. క్యాన్సర్‌ మందుల తయారీ పేటెంట్‌ హక్కులపై స్విట్జర్లాండ్‌ కంపెనీ నోవార్టీస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరిం చింది. జస్టిస్‌ అఫ్తాబ్‌ అలం, జస్టిస్‌ రంజన్‌ప్రకాశ్‌ దేశాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం నోవార్టీస్‌ వాదనను కొట్టేసింది. క్యాన్సర్‌కు తాము తయారు చేసే గ్లివెక్‌ మందులో కొత్త పదార్థాలను చేర్చామని, దీనిని దేశీయంగా భారత్‌ జనరిక్‌ డ్రగ్‌ను తయారు చేయకుండా నియంత్రించాలని తమ ఉత్పత్తికి పేటెంట్‌ అప్‌ కల్పించాలని నోవార్టీస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ మందులో కొత్త పదార్థాలు ఏవీ లేనందున పేటెంట్‌ ఇచ్చే అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సుప్రీం తీర్పుతో భారత్‌లో క్యాన్సర్‌ నివారణ మందులు తయారు చేసేందుక మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పును ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు ఎంతో ఆసక్తిగా గమనించాయి. కాగా నోవార్టీస్‌ తయారు చేసే ఈ గ్లివెక్‌ మందు నెలరోజుల మోతాదుకు రూ.1.2లక్షలు ఖర్చు అవుతుండగా, భారత్‌లో తయారు చేసిన మందు నెలరోజులకు రూ. 8వేలు మాత్రమే పేషెంట్లకు ఖర్చవుతుంది. పెటెంట్‌ హక్కులు స్వచ్ఛమైన పరిశోధనలకు మాత్రమే లభిస్తాయని, పదేపదే చేసే పరిశోధనలకు కాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రస్తుతం నోవార్టీస్‌ దాఖలు చేసుకున్న గ్లివెక్‌ మందులో కొత్తదనమేమీ లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ఔషధ కంపెనీలు ర్యాండ్‌ బ్యాక్సీ, సిప్లా తరఫున వాదించిన న్యాయవాది ప్రతిభా సింగ్‌ మాట్లాడుతూ భారత ఔషధ కంపెనీలకు సుప్రీం తీర్పు వల్ల విజయం లభించినట్టైందని, ఇక వారు క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు తక్కువ ఖర్చులో మందులు తయారు చేసుకోవచ్చని తెలిపారు. కాగా, విదేశీ కంపెనీలు స్వచ్ఛమైన పరిశోధనలు చేసినంతకాలం ప్రస్తుత సుప్రీం తీర్పుతో వాటిపై ఎలాంటి ప్రభావం పడబోదని చెప్పారు. నోవార్టీస్‌ తమ మందుకు 2006నుంచి పెటేంట్‌ హక్కు కోసం పోరాడుతోంది. చెన్నైలోని  మేధోసంపత్తి అప్పిలేట్‌ బోర్డు(ఐపిఎబి) ఇచ్చిన తీర్పుపై నోవార్టీస్‌ 2009లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నోవార్టీస్‌ వాదనను భారత ఫార్మా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరితో పాటు దేశంలోని ఆరోగ్య సహాయ కార్యకర్తలు కూడా సుప్రీంకోర్టులో ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. సుప్రీం తాజా తీర్పుతో ఏడేళ్ళుగా పెటేంట్‌ కోసం జరుపుతున్న నోవార్టీస్‌ పోరాటం ముగినట్టైంది.