ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలి…

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ జూలై 21(జనం సాక్షి): ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో డిసిపి సీతారాంతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వారికి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 2. 30 గంటల నుండి 5:30 గంటల వరకు నిర్వహించే రెండవ సంవత్సర పరీక్షల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు సమన్వయంతో పని చేస్తూ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు.
జిల్లాలో మొదటి సంవత్సరానికి గాను 1999 విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులు 606 మందితో మొత్తంగా 2605 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సన్నద్ధము అవుతున్నారని తెలియజేశారు.రెండవ సంవత్సరంలో 966 మంది విద్యార్థులతో పాటు ఒకేషనల్ 362 మంది విద్యార్థులతో కలిపి 1328 మంది విద్యార్థులుపరీక్షలకు హాజరవుతున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడపాలని, పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలను రాసేందుకు 3933 మంది హాజరవుతున్న దృశ్య 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
జూనియర్ బాలికల కళాశాల జనగామ, జూనియర్ బాలికల కళాశాల(కో ఎడ్యుకేషన్) జనగామ, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల జనగామ, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల జనగామ, ఏబీవీ జూనియర్ కళాశాల జనగామ, జూనియర్ బాలికల కళాశాల నర్మెట్ట, జూనియర్ బాలికల కళాశాల స్టేషన్ ఘనపూర్, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల స్టేషన్ ఘనపూర్, జూనియర్ బాలికల కళాశాల జాఫర్ గడ్ ,సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల పాలకుర్తి , జూనియర్ బాలికల కళాశాల కొడకండ్ల, జూనియర్ బాలికల కళాశాల దేవరుప్పల లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.ఈ పరీక్షల నిర్వహణ గాను 12 మంది చీప్ సూపరింటెండెంట్లు, 12 మంది శాఖ అధికారులు, ఇద్దరూ సహాయ చీఫ్ సూపర్డెంట్, మరో ఇద్దరు కస్టోడియన్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక సిట్టింగ్ స్క్వాడ్, ఏర్పాటు చేశామన్నారు.పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వాటి పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు.పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తారని అదేవిధంగా పారిశుధ్యం ఏర్పాట్లను మున్సిపాలిటీలలో మున్సిపల్ అధికారులు గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ సిబ్బంది చేపడుతున్నట్లు తెలియజేశారు అదేవిధంగా త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుందని కరోనా దృశ్య వైద్య శిబిరాల ఏర్పాటు చేస్తామని మాస్కులు శానిటైజర్లు వినియోగించాలని విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించాలన్నారు.పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసిందని 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అదేవిధంగా పరిసరాలలో జిరాక్స్ సెంటర్లు మూసి వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం పత్రాలను పోలీస్ శాఖ భద్రపరుస్తుందనిి  అన్నారు. పోస్టల్ శాఖ వారి నుండి పోలీస్ శాఖ పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు చేరవేయడం జరుగుతుందన్నారు.
అధికారులు అప్రమత్తతతో ఉండాలని బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు,ఆర్డిఓ మధుమోహన్, డిప్యూటీ వైద్యాధికారిణి డాక్టర్ కరుణశ్రీ, విద్యుత్ శాఖ అధికారి మల్లికార్జున్, ఆర్టిసి డిపో మేనేజర్ జోస్న, మున్సిపల్ కమిషనర్ రవీందర్, డి ఎల్ పి ఓ పార్థసారథి, పోస్టల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.