ఇంటింటికి నీరందించే హావిూని నిలబెట్టుకున్నాం
అనేక గ్రామాల్లో నీరు అందుతోంది:ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్,నవంబర్19(జనంసాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్ భగీరథ శరవేగంగా సాగుతోందని బాల్కొండ టిఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నీళ్లివ్వకుంటే ఓట్లడగమన్న హావిూకి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇప్పటికే వేలాది గ్రామాల్లో మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నీరు చేరుతోందన్నారు. నీళ్లు ఇచ్చాం కాబట్టే ఎన్నికల్లో మళ్లీ తెరాసదే గెలుపు అని పేర్కొన్నారు. అందుకే వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు టిఆర్ఎస్లో చేరి నమ్ముతున్నారని అన్నారు. తనను నమ్మి తెరాసలో చేరిన నాయకులు, కార్యకర్తలు పాత, కొత్త తేడా లేకుండా పనిచేయాలని కోరారు. అందరికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. అందరూ కారు గుర్తుకు బాసటగా ఉంటామని మాటిస్తున్నారన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో అభివృద్ధికి కృషి చేశానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీగా కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేగా తాను చేసిన
అభివృద్ధి ఫలితమే నేడు లభిస్తున్న ఆదరణ అన్నారు. ప్రజల ఆశీర్వదంతో మళ్లీ గెలిచి రెట్టింపు అభివృద్ధిని అందిస్తానన్నారు. ఇదిలావుంటే పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో జిల్లాకు ఏంచేశారని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తూ పరిశ్రమల స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ కవిత పతంజలి గ్రూపుతో చర్చించారని అన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు 5 రాష్ట్రాల ముఖ్య మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి ముమ్మర ప్రయత్నం చేస్తున్న తీరును హర్షించారు. చక్కర కార్మగారం గురించి మాట్లాడుతున్నారని, మరి అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైనుకు నిధులు తీసుకురావడానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎంపీ కవిత గెలిచిన కొన్ని రోజుల్లోనే కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి లైను పనులు పూర్తి చేసేందుకు అవసరమైన రూ.250 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే జిల్లాలోని యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.