ఇంటింటికి మంచినీరు లక్ష్యంగా మిషన్ భగీరథ
ఆదిలాబాద్,ఆగస్ట్31 ( జనంసాక్షి ) : పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో మిషన్ భగీరథ కింద ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు అందించేలా ముందుకు సాగుతోందని పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనిషా తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం మిషన్ భగీరథ పనులు గడువులోగా పూర్తిచేయించి నీటి కష్టాలు దూరంచేస్తామని వివరించారు. పురపాలక వార్డుల అభివృద్ధికి నిధులు లేకపోతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో హరితహారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పురపాలకానికి వచ్చే ఆదాయం కార్మికుల జీతాలు, విద్యుత్తు ఛార్జిలకే ఎక్కువగా ఖర్చవుతుండడంతో అన్ని వార్డుల్లో అభివృద్ధి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని మంత్రి కోరారు. మిషన్ భగీరథ కింద నిధులు మంజూరయ్యాయని పట్టణంలో ఏడాదిలో నీటి కొరత దూరమవుతుందని వివరించారు.