ఇంటింటికీ జాతీయ జెండా ఎగురవేయాలి

– మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఖైరతాబాద్ : ఆగస్టు 11 (జనం సాక్షి)  స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అందుకు ఇంటింటికి జాతీయ జెండా ఎగురవేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తయ్యిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్నందున ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగుర వేసి ఇంటింటికి విద్యుత్ దీపాలంకరణ చేసుకున్నప్పుడే వజ్రోత్సవాల్లో ప్రాధాన్యత ఇచ్చిన వారవుతారని మేయర్ అన్నారు. వాణిజ్య సముదాయాలు, చిన్న చిన్న షాపుల యజమానులు కూడా ఇంటికి విద్యుత్ దీపాల అలంకరణ చేయాలని అదే విధంగా మాల్స్ కూడా తప్పని సరిగా జాతీయ జెండా, విద్యుత్  దీపాలతో అలంకరణ చేయాలని మేయర్ ప్రజలను, వ్యాపార వాణిజ్య సముదాయాల యజమానులను కోరారు.  నగరంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉన్న  ప్రాంతాల్లో తప్పని సరిగా జాతీయ జెండా, విద్యుత్ దీపాల అలంకరణ చేయించేందుకు తమ తమ పరిధిలోని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు వారితో మాట్లాడి మెప్పించి విద్యుత్ దీపాల అలంకరణకు తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లను మేయర్ ఆదేశించారు.