ఇంటికొకరు ఊరుపోరై కదలండి

చలో అసెంబ్లీతో సత్తా చాటుదాం : ఈటెల
హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) :
చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇంటికొకరు చొప్పున ఊరుపోరై కదలండని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు.  ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీ విజయంతం చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమ పోస్టర్‌ను ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాము శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం చేపట్టామని, కానీ ప్రభుత్వం రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ కార్యక్రమం ఆగదని, ఆరు నూరైనా కార్యక్రమాన్ని విజయవంతం చేసితీరతామని పేర్కొన్నారు. చలో అసెంబ్లీని ఆపాలనుకుంటే, దానికి ముందుగానే శాసనసభలో  తెలంగాణ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి అన్ని పార్టీలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలిరావాలని, ప్రజాస్వామ్య బద్దంగా తమ నిరసనను తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యవహార శైలిపై ఈటెల మండిపడ్డారు. సీఎం కిరణ్‌ రాచరిక పాలనను తలపించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చలో అసెంబ్లీ ఏర్పాట్లలో నిమగ్నమైన నేతలను, తెలంగాణవాదులను ప్రభుత్వం బెదిరించడం సరికాదన్నారు. పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌తో సంబంధమున్నట్లు వార్తలు వస్తున్న బోధన్‌ ఇన్‌చార్జి షకీల్‌పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈటెల ఓ ప్రశ్నకు బదులిచ్చారు. భవిష్యత్‌ నిర్మాణం కోసమే విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోకి వస్తున్నారని ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా టీఆర్‌ఎస్‌ కాపాడుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీలకు చిత్తశుద్ధి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుపై ఆయన మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. వారిద్దరు దొంగమాటలు మాట్లాడడం మానుకొని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేయించేందుకు కృషి చేయాలని సూచించారు.