ఇందిరమ్మ రాజ్యమంటే.. ఎమర్జెన్సీ, చీకటి రోజులు


` అధికారమివ్వండి.. ఆటో ఫిట్‌నెస్‌ పన్ను రద్దు చేస్తాం
` ఎలక్షన్‌ మారునాడే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులరైజ్‌
` సరైన నాయకుడిని ఎన్నికుంటేనే రాష్ట్ర అభివృద్ధి
` మోసం చేయడంలో కాంగ్రెస్‌ ఎప్పుడూ ముందే
` 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసింది
` తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసింది
` చిరుమర్తికి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వాలి
` నకిరేకల్‌ సభలో సిఎం కెసిఆర్‌ పిలుపు
` నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉన్నది..
` గందరగోళమైతే నష్టపోయేది విూరే..
` మిగిలిన కొద్దిమంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తాం
` ప్రజా ఆశీర్వాద సభల్లో  సీఎం కేసీఆర్‌
మానకొండూరు ఆర్‌సి/నకిరేకల్‌/నల్లగొండ/స్టేషన్‌ ఘన్‌పూర్‌(జనంసాక్షి):దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తయిన రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మానకొండూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావద్దని అన్నారు. ఓటేసుడుతోటే దుకాణం ఒడిసిపోదని, అక్కడే కథ మొదలైతదని చెప్పారు. విూరు గెలిపించిన ఎమ్మెల్యే వెనుక ఉన్న పార్టీ అధికారంలోకి వస్తదని చెప్పారు. కాబట్టి బాగా ఆలోచించి ఆచీతూచీ ఓటేయాలని సూచించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతది. విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దు. అమెరికా లాంటి దేశాల్లో ఇట్ల సభలు పెట్టి ఓట్లడుగరు. టీవీలల్లనే ప్రచారం చేస్తరు. మన దేశంల కూడా ఆ రోజులు రావాలె. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలె. ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని సీఎం చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర ఏందో విూకు తెలుసు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో విూరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్‌ పరిపాలన’ అని సీఎం ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌ పరిపాలనలో పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని రసమయి బాలకిషన్‌కు మద్దతుగా ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజలు, హక్కుల కోసం. ఈ రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది కాంగ్రెస్‌ పార్టీ. ఇల్లంతకుంటతో పాటు పలు మండలాల్లో పత్తి కాయ పగిలినట్లు మావోళ్లు గుండెలు పగిలిపోయి చనిపోయారని బాలకిషన్‌ గుర్తు చేశారు. పత్తికాయలు పగిలినట్టు రైతుల గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నది అప్పులపాలైంది కాంగ్రెస్‌ రాజ్యంలో అని కేసీఆర్‌ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అంటున్నారు. అన్నమే లేకుండే.. తిన్నోడు తిన్నడు తిననోడు తినలేదు. ఇందరిమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామరావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇందిరామ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీ రామారావు 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఆలోచించాలి. ఆ బియ్యం పెట్టిన తర్వాత పేదల కడుపు నిండిరది. అప్పటిదాకా సగం తిని సగం పడుకున్న వాళ్లు ఉండ్రి. ఇది నిజం కదా..? ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే హైదరాబాద్‌, బొంబై, భీవండి ఎందుకు వలసపోయారు. కూలినాలీ చేసుకునే గతి ఎందుకు పట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ. అందర్నీ పట్టుకుపోయి జైళ్లో వేసుడు. ప్రభుత్వాలు కూలగొట్టుడు. అది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఉన్నోడు ఉండే లేనోడు లేకనే ఉండే. మళ్లా ఆ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు ఎవర్ని గోల్‌ చేయడానికి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెస్‌ పార్టీ కదా..? 58 ఏండ్లు కోట్లాడి బయటపడ్డాం. ఎంతో గోస పోసుకున్నారు. ఇల్లంతకుంటలో నా క్లాస్‌మేట్స్‌, స్నేహితులు ఉండే, సిద్దిపేటలో చదివినోళ్లు. పెళ్లిళ్లకు కూడా వచ్చాను. ఎక్కడ చూసినా దుబ్బలే ఉండే. ఏం లేకుండే, మన్ను కూడా లేకుండే, బతక లేకుండా ఉండే. వానాకాలం పంట పండితే పండినట్టు. చివరకు గడ్డి లేక పశువులను అమ్ముకున్న దయనీయ పరిస్థితి అని కేసీఆర్‌ పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం
తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్‌ ఛార్జీలు, సర్టిఫికెట్‌ జారీలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ’ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. ట్రాఫిక్‌ పోలీసులు పొద్దాక పొగలో ఉంటరు కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటరు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే 30శాతం అలవెన్స్‌ వారి వేతనంలో ఇస్తున్నాం. భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే. ఎక్కడ కూడా ఇంత ఇవ్వరు’ అన్నారు.ఆటోరిక్షా పోరగాళ్లు ఉన్నరు. వాళ్లకు నేను ఇవాళ శుభవార్త చెబుతున్నాను. వారికి ఆదాయం వచ్చే తక్కువ. నరేంద్ర మోదీ విపరీతంగా డీజిల్‌ ధర పెంచేటట్టు చేసిండు. దేశవ్యాప్తంగా ఆటో రిక్షా కార్మికుల దగ్గర ముక్కుపిండి పన్ను వసూలు చేస్తరు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాంగనే పన్ను రద్దు చేసిన. రూపాయి పన్ను లేదు. ఇప్పుడు వాళ్లకు ఏం బాధ ఉన్నదంటే. సంవత్సరానికి కోసారి ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. ఆ ఫిట్‌నెస్‌కు వెళితే రూ.700 ఛార్జి చేస్తరు. సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు రూ.500 ఛార్జీ వేస్తున్నరు. మొత్తం కలిపి రూ.1200 అవుతుంది. ఈ సారి బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వస్తే ఫిట్‌నెస్‌ పన్నును రద్దు చేస్తమని ప్రకటిస్తున్నా. కరీంనగర్‌కు నాకు ఏదో శ్రుతి ఉన్నది. కరీంనగర్‌ భీముడు కమలాకర్‌ మొన్న అన్నడు. విూకు కరీంనగర్‌కు ఏదో లింక్‌ ఉన్నది సార్‌ అన్నడు. లింక్‌ అయితే ఉన్నదనుకో ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్‌ పిల్లనే పెళ్లి చేసుకున్న. నేను కరీంనగర్‌ ఎప్పుడు వచ్చినా ఏదో స్కీమ్‌ ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్‌నెస్‌ ఛార్జి, సర్టిఫికెట్‌ ఛార్జీలను రద్దు చేస్తాం. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు అందరికీ అన్నీ చేసుకుంటూ పోతున్నాం’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ
నకిరేకల్‌:కాంగ్రెస్‌ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్‌ఎస్‌ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మోసం చేయడంలో ఆ పార్టీ ముందుంటుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నకిరేకల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎవ్వళ్లు ఏం చేసిండ్రు. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవ్వళ్లు ప్రజల కోసం పాటు పడుతారు అనేది ఆలోచించి విూరు ఓటేసినట్టే అయితే విూకు లాభం జరుగుతది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్రా రాఘవరెడ్డి ఎండిపోయిన వరి కంకులు చూపిస్తుండే. కరెంట్‌ కోసం రోజు కొట్లాడుతుండే. విజయవాడ రోడ్డు అప్పుడప్పుడు బంద్‌ చేపిస్తుండే. అప్పుడుప్పుడు అసెంబ్లీలో కంకులు తెచ్చి చూపిస్తుండే. అటువంటి మహానాయకుడు ఈ గడ్డ విూద పుట్టారు. కమ్యూనిస్టు సోదరులకు మనవి చేస్తున్నా. ఇక్కడ విూరు పోటీలో లేరు. విూ ఓట్లు ఎవరికో వేసి మోరిలో పడేయకండి. ఒక ప్రగతికాముకమైన బీఆర్‌ఎస్‌ పార్టీకి దయచేసి వేయండి. లింగయ్యకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని కేసీఆర్‌ కోరారు.ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావద్దని, ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఓట్లు వేయవద్దని, ఆచితూచి, బాగా ఆలోచించి ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ జిల్లా మహనీయులు పుట్టిన జిల్లా అని కొనియాడారు. ’ఈ జిల్లా వట్టికోట ఆళ్వారు స్వామి పుట్టిన జిల్లా. ఇది నర్రా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ. బాగా చైతన్యం ఉండే ప్రాంతమని నా విశ్వాసం. ఎన్నికలు వస్తుంటయ్‌.. పోతుంటయ్‌. ఎన్నికలు రాగానే గడబిడ గావద్దు. ఎవరో చెప్పింది నమ్మి ఓటేయొద్దు. బాగా ఆలోచించి ఓటేయాలె. అందుకు కావాల్సిన ప్రజాస్వామ్య పరణతి మనలో రావాలె. విూరు ఆషామాషీగా ఓటేస్తే గెలువాల్సిన వాళ్లు కాకుండా ఇతరులు గెలుస్తరు. అప్పుడు వాళ్ల పాలన బాగున్నా లేకున్నా ఐదేండ్లు భరించాలె. కాబట్టి ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలను చూడాలె. ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను పరిశీలించాలె. ఏ పార్టీ చరిత్ర ఏంది..? తెలుసుకుని ఓటేయాలని సీఎం చెప్పారు. ’బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల బాగుకోసం పుట్టింది. 15 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఇస్తమని 2004ల టీఆర్‌ఎస్‌తోటి పొత్తుపెట్టుకుంది. ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పింది. కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని గట్టిగ కొట్లాడినంక ఆఖరికి దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. ఇది కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర. కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ పదేండ్ల పాలనలో ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చినం. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినం. ఇవన్నీ విూకు తెలిసినవే’ అని సీఎం అన్నారు. ’రైతుల సంక్షేమం కోసం కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నది. విూ దగ్గర మూసీ ప్రాజెక్టు ఉంది. గతంలో నీటి తీరువాను వసూలు చేసేటోళ్లు. మేం దాన్ని రద్దు చేసినం. 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నం. 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి విూరు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. ఇవన్నీ విూ కళ్లముందు జరుగుతున్నయే. కానీ కాంగ్రెస్‌ పార్టీ 50 ఏండ్ల పాలనలో కనీసం మంచి నీళ్లు కూడా ఇయ్యలే’ అని సీఎం విమర్శించారు.బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు కమ్యూనిస్టు సోదరులంతా మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. లింగయ్య ప్రజల్లో ఉండే మనిషి. ఆయన వ్యక్తిగత పనులు ఏ రోజు అడగలేదు. కాల్వలు, అయిటిపాముల ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల, హాస్పిటళ్ల గురించి అడిగిండు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, బ్రహ్మాండంగా గెలిపించండి. లింగయ్య గెలుపును ఎవడు ఆపలేడు. ప్రజా శక్తి ముందు వ్యక్తులు ఎవరేం చేయలేరు. కాయలు ఉన్న చెట్టు విూదనే రాళ్లు పడుతాయి. రందీ పడాల్సిన అవసరం లేదు. ఇంత ప్రజా శక్తి నీ వెంట ఉన్నది.. తప్పకుండా విజయం నీదే.. అందులో అనుమానమే లేదు. లింగయ్యను గెలిపించండి.. ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు.
పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు?..
నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని కంచర్ల భూపాల్‌ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.నల్లగొండ పట్టణంలో మేధావులు, చదువుకున్న వాళ్లు, ఉద్యోగస్తులు ఉంటారు. విూ అందర్నీ కోరుతున్నా. నల్లగొండ పట్టణం ఇవాళ నగరం రూపు కనబడుతోంది. బ్రహ్మాండమైన డెవలప్‌ కనబడుతుంది. రూపాయికే కనెక్షన్‌ ఇచ్చి నల్లా నీళ్లు ఇస్తున్నాం. ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతున్నది. ఈ జరిగే అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో విూరు జారవిడుచుకోవద్దు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రగల్భాలు విూకు తెలుసు. వాళ్ల డబ్బు అహంకారంతోని ఇంతకు ముందే నాకు నకిరేకల్‌లో చెబుతున్నారు. నకిరేకల్‌లో మేం గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నకిరేకల్‌ దాకా అందర్నీ పండవెట్టి తొక్కుతం అని మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి. ఈ పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు..? వీళ్లేనా మనకు కావాల్సింది. భూపాల్‌ రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి. గతంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆయన. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయన హైదరాబాద్‌ పోయి ఉండలే. నల్లగొండలో అదే ఇంట్లో ఉన్నడు తప్ప ఇల్లు కూడా మార్చలేదు. ఇవాళ ఎమ్మెల్యే ఉన్న అదే ఇంట్లో ఉన్నడు తప్ప ఇల్లు మార్చలేదు. ప్రజల మధ్యలో ఉండి, పొద్దున్నే లేస్తే విూ మధ్యలో తిరిగేటోళ్లు కావాల్నా..? గెలిచిన తెల్లారే హైదరాబాద్‌లో పడేటోళ్లు కావాల్నా..? దయచేసి ఆలోచించాలి అని కేసీఆర్‌ కోరారు.ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు నల్లగొండకు వస్తున్నాయి. మళ్ల నేను విూకు మాట ఇస్తున్నా. నల్లగొండ నియోజకవర్గం ఇంకా నా దత్తతలోనే ఉన్నది. నా డ్యూటీ, భూపాల్‌ రెడ్డి డ్యూటీ అయిపోలేదు. ఇప్పుడు విూరు చూస్తున్న దాని కంటే ఎన్నో రేట్లు అభివృద్ధి జరుగుతది. మేం రెండు మూడు విషయాల విూద కాన్‌సెంట్రేషన్‌ చేయబోతున్నాం. మేం ఏదన్న చేస్తే గట్టి చేస్తం. ఇప్పటి దాకా సంక్షేమం చేసినం. రైతులను ఆదుకున్నాం. రాబోయే రోజుల్లో వైద్యం కూడా స్థిరపడుతున్నది. హాస్పిటళ్లు కూడా బాగు అవుతన్నయి. ఇండ్లు లేని ప్రజలు ఎవరు అయితే ఉన్నారో.. ప్రాజెక్టులాగా ఒక టాస్క్‌లాగా తీసుకొని, పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని మనవి చేస్తున్నాను. అన్ని వర్గాలను ఆదుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.నల్లగొండ నియోజకవర్గం మంచిగా అభివృద్ధి జరుగుతున్నది. దీన్ని ఇదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నల్లగొండ వాసుల విూద ఉన్నది. ఏదో కల్లబొల్లి మాటలు నమ్మి గందరగోళమైతే నష్టపోయేది విూరే.. నా దత్తత ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా పని చేసే బాకీ ఉన్నది. తప్పకుండా విూ అభివృద్ధి కోసం భూపాల్‌ రెడ్డి, నేను కలిసి కష్టపడి పని చేస్తాం. విూరు ఊహించనంత అభివృద్ధి కూడా చేసి చూపెడుతాం అని పేర్కొంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
మిగిలింది కొద్దిమంది రైతులే.. వారికి 100 శాతం రుణమాఫీ చేస్తాం : సీఎం కేసీఆర్‌
స్టేషన్‌ ఘన్‌పూర్‌ : మిగిలిన నాలుగైదు శాతం మంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రసంగించారు.
కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడితే కొన్ని విషయాల్లో సిగ్గుండాలి. రైతురుణమాఫీ చేస్తామని రెండు సార్లు చెప్పాం. బాజాప్తా చేసినం. అందులో కరోనా రావడం వల్ల ఒక సంవత్సరం ఆదాయం సున్నా అయింది. రూపాయి కూడా రాలేదు. దాని వల్ల లేట్‌ అయింది. లేదంటే ఎప్పుడ అయిపోవు రైతు రుణమాఫీ. రుణమాఫీ మూడేండ్ల కిందనే అయిపోవాలి. కరోనా కొట్టిన దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయి ఆలస్యమైంది. మొన్న చేసినం. 90 శాతం అయిపోయింది రుణమాఫీ. ఏనుగు వెళ్లింది తోక చిక్కింది. లక్ష వరకు అందరికీ అయిపోయింది. ఆ పైన ఉన్నోళ్లకు ఓ నాలుగైదు శాతం మందికి మిగిలింది. అది ఇయ్యమా మేం. దాన్ని కూడా ఇష్యూ చేశారు కాంగ్రెసోళ్లు. అడ్డు పడ్డది కూడా కాంగ్రెసోడే. ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఇప్పుడు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిండు. మళ్లా బజార్లకు వచ్చి రుణమాఫీ కాలేదని మాట్లాడుతున్నరు. సిగ్గు కూడా ఉండాలి. మిగిలిన వాళ్లకు కూడా 100 శాతం ఇమిడియట్‌గా ఇచ్చేస్తాం. దాని గురించి అసలు ఆలోచించే అవసరం లేదు రైతులు. మంచేదో, చెడు ఏందో నిర్ణయించాలి.. ఆలోచించి ఓటేయాలని కేసీఆర్‌ కోరారు.టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. ఎలక్షన్‌ తెల్లారే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రసంగించారు.ఆర్టీసీ బిడ్డలు ఉన్నారు. వాళ్లది పాపం ఎప్పుడు ఉద్యోగం పోతదో తెల్వదు. ఒక అభద్రతా భావం. ఆర్టీసీ బిల్లు పాస్‌ చేసినం. అది గవర్నర్‌ ఆలస్యం చేయడం వల్ల అది కొంత ఆలస్యమైంది. ఎలక్షన్‌ తెల్లారే ఆర్టీసీ బిడ్డలను రెగ్యులరైజ్‌ చేసి గవర్నమెంట్‌ ఉద్యోగస్తులుగా చేస్తాం అని కేసీఆర్‌ ప్రకటించారు.మన వద్ద లక్షల మంది ఆటో రిక్షా బిడ్డలు ఉన్నారు. ఇండియా మొత్తంలో ఆటో రిక్షాలకు ట్యాక్స్‌ ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో లేదు. వారు పేదవాళ్లు బతుకుతున్నారని ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చాం. వాళ్లకు ఇంకో సమస్య ఉంది. ఏందంటే ఫిట్‌నెస్‌ కోసం పోతే ఏడాదికి రూ. 1200 కట్టాల్సి వస్తుంది. అది కూడా ఎలక్షన్‌ తెల్లారి రద్దు చేస్తామని చెబుతున్నా. ఆటో రిక్షా కార్మికులకు కూడా ఫిట్‌నెస్‌ ట్యాక్స్‌, పర్మిట్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం. జీరో చేస్తాం. ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వస్తది అయినా పర్వాలేదు. వాళ్లు పేదవాళ్లు ఐదారు లక్షల మంది ఆటో నడిపి బతికేవారు ఉన్నారు. వాళ్ల సంక్షేమం కోసం అది కూడా చేస్తామని కరీంనగర్‌లో ప్రకటన చేశాను. ఆ విధంగా ఆటో కార్మికులను ఆదుకుంటాం. అలా ప్రతి వర్గాన్ని ఆదుకుంటూ ముందుకు పోతున్నాం కేసీఆర్‌ తెలిపారు.