ఇందిరాపార్క్‌కు రండి

అక్కడి నుంచే పోరు పయనం
కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కరుడుగట్టిన యోధులంతా శుక్రవారం ఉదయానికల్లా ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకోవాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చలో అసెంబ్లీకి తెలంగాణ మంత్రులు అనుమతులు తీసుకురాని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గ్రామాల్లోకి రానివ్వవద్దని పిలుపునివ్వడమేకాక అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. జిల్లాల్లోనుంచే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా ఇందిరాపార్క్‌కు వస్తే అక్కడి నుంచి అసెంబ్లీకి బయలు దేరుతాన్నారు. ఇందిరా పార్క్‌కు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడే నిరసన దీక్షలు చేపట్టాలని ఆయన సూచించారు. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బైండోవర్లు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్‌ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా తాము ప్రభుత్వానికి హామీ ఇస్తున్నామని, తెలంగాణలో ఏ ఉద్యమం కూడా విధ్వంసాలకు తావివ్వలేదన్నారు. శాంతియుతంగా చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోదండరామ్‌ కోరారు. ప్రజలంతా శాంతియుతంగా ఆందోళనలు చేయాలని సూచించారు. అయినా కూడా ఏదైనా విధ్వంసాలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అనమతిచ్చినా కూడా తాము మాత్రం ఇవ్వమని నగర కమీషనర్‌ అనురాగ్‌శర్మ పేర్కొనడం దారుణమన్నారు. అసలు రాష్టాన్న్రి పాలిస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమా లేక పోలీసులా అనేది అనుమానంగా ఉందన్నారు. సీపీ చేసిన వ్యాఖ్యలకు స్పందించి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. నిజంగానే ముఖ్యమంత్రి దమ్మున్న వ్యక్తే అయితే సీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీ టీడీపీని తెలంగాణలో పూర్తిగా నిషేధిస్తామని కోదండరామ్‌ హెచ్చరించారు. ఓవైపు ఆందోళన కొనసాగుతుంటే, తెలంగాణలో ప్రజలను నిరంకుశంగా పోలీసులు అరెస్టులు, బైండోవర్లు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తెలంగాణ తీర్మానం కోసంగాని, చలో అసెంబ్లీకి అనుమతి కోసం చంద్రబాబు ఎందుకు వాయిదా తీర్మానాలు గాని అసెంబ్లీని స్టాల్‌గాని చేయడం లేదని ప్రశ్నించారు. దీనితోనే ఆయన ఆపార్టీ తెలంగాణాకు వ్యతిరేకమని తేటతెల్లం అవుతుందన్నారు. తెలంగాణ పోరుబిడ్డలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ ప్రజల సత్తాచాటాలని, సీమాంధ్ర పెత్తందారులకు, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ బలమేంటో చూపాలని పిలుపునిచ్చారు.