ఇందుకేనా సమైక్య ఉద్యమం?
సమైక్యాంధ్ర పేరుతో మూడేళ్లుగా సాగుతున్న కృత్రిమ ఉద్యమం మాటున చీకటి కోణాలెన్నో… అలాంటి చీకటి కోణాల్లోంచి ఓ హవాలా బాగోతాన్ని కోబ్రాపోస్ట్ తన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలు చేసింది. సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ చైర్మన్‌గా చెప్పుకునే రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకె శైలజానాథ్ హవాలా బాగోతానికి సూత్రధారి అని తేల్చింది. రూ. 25 కోట్ల రూపాయల లెక్కలేనని సొమ్మును బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాలో ఆయన స్నేహితుడి పేరున డిపాజిట్ చేశారు. అలా చీకట్లో సంపాదించిన నల్లధనాన్ని చెలామణీలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సొమ్ము ఎక్కడితో, ఎలా సంపాదించిందో, పోని ఎవరు ఇచ్చారో అని చెప్పేందుకు సదరు సమైక్యాంధ్ర నేతకు నోరు రాదు.
కేవలం మాట సాయం మాత్రమే చేశానని, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని శైలజానాథ్ చెప్పుకునే ప్రయత్నం చేసినా అది అంత నమ్మశక్యంగా లేదు. ఇంతకాలం తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొళ్లగొట్టి కోట్లకు పడగలెత్తిన సీమాంధ్ర పెత్తందారిశక్తులు అవే డబ్బులు ఢిల్లీ పెద్దలకు ముడుపులుగా ముట్టజెప్పి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఢిల్లీలో కొద్దిగ కదలిక రాగానే గద్దల్లా వాలిపోయే సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు టెన్ జన్‌పథ్‌ను, పీఎంవోను, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రభావితం చేయగల వ్యక్తులకు కోట్లాది రూపాయలు కుమ్మరించి అంతా తూచ్ అనిపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక చేతులు మారుతున్న ధనం న్యాయంగా తెలంగాణ ప్రజలకు దక్కాల్సింది. అదే ధనాన్ని అడ్డుపెట్టుకొని సీమాంధ్ర పెత్తందారిశక్తులు తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్‌ను తొక్కిపెట్టగలుగుతున్నాయి. తెలంగాణ వనరులను కొళ్లగొట్టేందుకే, గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకొని తరతరాలకు సరిపడా కూడబెట్టుకునేందుకే సీమాంధ్ర పెత్తందారులు సమైక్యాంధ్ర పేరుతో బూటకపు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చినపుడు అతి సామాన్యులుగా ఉన్న వారు ప్రభుత్వంలో, అధికారవర్గంలోని తమ బంధుగణం సహకారంతో ఇప్పుడు బిజినెస్ టైకూన్లుగా అవతరించిన విషయం అందరికీ తెలిసింది.
కేవలం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్న వ్యక్తులు తర్వాత కాలంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని తమ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు అడ్డు పెట్టుకొని ఎంతో ఎత్తుకు ఎదిగారు. అలాంటి వ్యక్తులు, శక్తులే ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ పోటీ ఉద్యమాలను నడిపిస్తున్నారు. ఇక్కడి ప్రజల రక్తమాంసాలను గద్దల్లా తాగి, పొడుచుకుతిని తెగబలిసిన ఆయా శక్తులు ఇప్పుడు ఢిల్లీలో పెద్ద లాబీయిస్టులుగా అవతరించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వెనుక నాలుగు దశాబ్దాల పోరాటం, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి. అత్యంత అమూల్యమైన ప్రాణాలను కూడా తెలంగాణ కోసం బలిపెట్టిన చరిత్ర ఉంది. రాజకీయంగా కూడా చైతన్యవంతమైన తెలంగాణ గడ్డ 1969 ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజా సమితిని పెద్ద ప్రజాస్వామిక శక్తిగా అవతరింపజేసింది. 1971లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీపీఎస్‌కు తెలంగాణ ప్రజలు 10 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. ఎంపీలతో సహా మర్రి చెన్నారెడ్డి టీపీఎస్‌ను గంపగుత్తాగా కాంగ్రెస్ పార్టీలో కలిపేశాడు. తర్వాతి కాలంలో ఉద్యమం రాజకీయ పార్టీలను దూరంపెట్టింది. ప్రజాసంఘాలు తెలంగాణ కోసం నిర్విరామ పోరాటాలు సాగించాయి. ఈక్రమంలో రాజ్యం ఎంతోమంది తెలంగాణవాదులను వివిధ పేర్లతో పొట్టనబెట్టుకుంది. అయినా తెలంగాణ గడ్డ నివురు కప్పిన నిప్పువలే కణకణమండుతూనే ఉంది. 2000 సంవత్సరం తర్వాత ఉద్యమం ఉధృతమైంది. ఊరువాడా ఒక్కటై ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పోరుదారిన సాగాయి. రహదారులు, రైలు పట్టాలు, బస్టాండ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీలు ఉద్యమ వేదికలయ్యాయి. చేతి వృత్తులు మొదలు సర్కారీ కార్యాలయాల్లో పనులు ఆగిపోయాయి.
సింగరేణి బొగ్గు గనుల్లో తట్టాచెమ్మాస్ కదల్లేదు. ఒక్క బొగ్గుపెళ్లా వెలుపలికి రాలేదు. ఆర్టీసీ బస్సులు డిపో దాటలేదు. తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెకు దిగి ముఖ్యమంత్రికి కూడా జీతం రాకుండా చేశారు. అంతటి ఉద్యమ చరిత్ర తెలంగాణది. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఓ బూటకపు ఉద్యమానికి పెత్తందారులు తెరతీశారు. వారి చేతుల్లోనే ఉన్న సీమాంధ్ర మీడియా ఆ కృత్రిమ ఉద్యమాన్ని చిలువలు పలువలు చేసి ప్రసారం చేసింది. అదేసమయంలో లాబీయిస్టులు ఢిల్లీలో పెద్దఎత్తున పావులు కదిపారు. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులతో, డబ్బుకు గడ్డితిని ఏదైనా చేసే శక్తులతో చేతులు కదిపి తెలంగాణపై చేసిన ప్రకటన వెనక్కు తీసుకునేలా ఒత్తిడి పెంచారు. అందుకు హవాలా రూపంలో సమకూరిన ధనాన్ని వెదజల్లారు. ఇంకా వెదజల్లుతూనే ఉన్నారు. అందుకోసమే సమైకాంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. సమైక్యాంధ్ర అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అంతా. అందులో తెలంగాణ భాగమే. కానీ సీమాంధ్రులు నడిపిస్తున్న బూటకపు ఉద్యమంతో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ అంటకాగరు. తెలంగాణ ప్రజల భాగస్వామ్యం లేకుండా సాగిస్తున్నది ఎలా సమైక్యాంధ్ర ఉద్యమమో వారికే తెలియాలి. కేవలం వనరుల దోపిడీ కోసం సాగిస్తున్న బూటకపు ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి.