డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధం

 

 

 

 

 

 

డిసెంబర్ 18 (జనం సాక్షి):రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కోరుతూ నోటీసులు జారీచేసింది. ఈ అంశంపై ఈ నెల 22న విచారిస్తామని ప్రకటించింది. రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ధన్‌గోపాల్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ జరిపారు. సెప్టెంబర్‌ 2025న ప్రభుత్వం జారీచేసిన డీజీపీ నియామక ఉత్తర్వులు 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకమని పిటిషనర్‌ వాదించారు.

తాతాలిక ప్రాతిపదికన డీజీపీని నియమించరాదని ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. డీజీపీ నియామకం కోసం ఎంపిక చేసిన ప్యానల్‌ ఒకరిని సూచించాలని, వారి నియామకం శాశ్వతమైనదిగా ఉండేలా చూడాలని చెప్పారు. డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పోస్టు భర్తీ వివరాలు సమర్పించాలని చెప్పారు. అర్హులైన ఐపీఎస్‌ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. యూపీఎస్సీకి జాబితా పంపామని, ఈ లోగా కొందరు అధికారుల పదవీ విరమణతో ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారిందని వివరించారు. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించారని భావిస్తే సర్వోన్నత న్యాయస్థానంలోనే ధికార పిటిషన్‌ వేయాలని సూచించారు. ఈ కేసులో వివరాలు అందజేసేందుకు గడువు కావాలని కోరడంతో అందుకు హైకోర్టు అనుమతిచ్చింది.

13 నుంచి కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్‌ కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ నిర్వహిస్తున్నట్టు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. జనవరి 16 నుంచి 18 వరకు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఉత్సవాన్ని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో, జనవరి 13, 14న డ్రోన్‌ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ గాలిపటాలు, స్వీట్స్‌ ఉత్సవంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను ప్రోత్సహించడానికి, రాష్ట్రానికి ఎక్కువ మంది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి, డ్రోన్‌ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గురువారం హోటల్‌ ప్లాజాలో టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.