న్యూక్లియర్‌ ఎనర్జీలో బలోపేతం కావాలి

 

 

 

 

 

 

డిసెంబర్ 18 (జనం సాక్షి): భారతదేశం న్యూక్లియర్‌ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. అణుఇంధన రంగంలోకి ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తునందున భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని హెచ్చరించారు. అణు ప్రమాదాలు సంభవిస్తే వాటి తీవ్రత చాలా ఎకువగా ఉంటున్నందున భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని సూచించారు. రాజ్యసభలో ‘సస్టెయినబుల్‌ హార్నెసింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌ఏఎన్‌టీఐ-శాంతి)బిల్లు-2025’పై గురువారం జరిగిన చర్చలో సురేశ్‌రెడ్డి ప్రసంగించారు. కొత్త బిల్లుతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు, విద్యుత్తు కొరత గల ప్రాంతాలకు నిజంగానే విద్యుత్తు అందుతుందా? అని ప్రశ్నించారు. కేవలం పట్టణ లేదా పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితం కాకుండా, సామాన్యులకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నందున విద్యుత్తు ఉత్పత్తి చేయాలని చెప్పారు.

పర్యావరణ బాధ్యతపై స్పష్టత ఇవ్వండి

శాంతి బిల్లులో పర్యావరణ పరిరక్షణ అంశంపై స్పష్టత లేదని సురేశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. అణువ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై పడే ప్రభావానికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంగా పేరొనాలని డిమాండ్‌చేశారు. అణు ఇంధనం కోసం జరిగే గనుల తవ్వకాలపై ప్రభుత్వం అనుసరించేవిధానాన్ని తెలుపాలని కోరారు. నల్లగొండ జిల్లా నల్లమలలో తవ్వకాలు, పరిశోధనలు జరుగుతున్నాయని, గిరిజన ప్రాంతాల్లో అణుపరీక్షల కారణంగా క్యాన్సర్‌ వంటి రోగాలు వస్తున్నాయని, భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా, తాలుకా స్థాయిలోనూ వికసిత్‌ భారత్‌ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కోరారు.