ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : భారత ప్రాదేశిక జిల్లాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ నావికుల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటలీ నావికుల కేసును విచారించే హక్కు కేరళ కోర్టులకు లేదని గతంలో సుప్రీం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఇటలీ నావికులు మాసిమిలియానో, లక్టోర్‌, సల్వటోర్‌ గిరోన్‌,  ఇద్దరు భారత జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపారు. ఈ కేసులో రెండుసార్లు ఇటలీ నావికులు తమ దేశం వెళ్ళారు. రెండోసారి వెళ్ళినప్పుడు భారత్‌కు తిరిగి పంపేది లేదంటూ ఇటలీ ప్రభుత్వం మొండికేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఇటలీ రాయబారిని అభిశంసించింది. ఆయనపై తమకు విశ్వాసం లేదని, తామిచ్చిన గడువు (మార్చి22) లోగా తిరిగి రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో విపక్షాల నుంచి యూపిఏ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా, ఇటలీ మూలాలు కలిగి ఉండడం కూడా విపక్షాల విమర్శలు పదునెక్కాయి. దీంతో ప్రధాని మన్మోహన్‌తో పాటు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఇటలీ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. భారత్‌ను తేలికగా అంచనా వేస్తే సహించేంది లేదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎట్టకేలకు దౌత్య సంభాషణల అనంతరం ఇటలీ నావికులు కోర్టు ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.