ఇది యాత్రాకాలం !
పూర్వ కాలంలో అంటే రాజులు తమ దేశ ప్రజలు తమ సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు మారు వేషాలు వేసుకుని జనాల్లో తిరిగేవారట ! ఈ విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచేవారట ! కనీసం తమ భార్యా పిల్లలకు కూడా తెలియనిచ్చేవారు కాదట ! వేటకో, తీర్థ యాత్రలకో వెళ్తున్నామని చెప్పి తమ పర్యటనను అత్యంత రహస్యంగా జరిపేవారట ! సకల సుఖాలను ఈ పర్యటన కాలంలో త్యజించి, ఓ మామూలు మనిషిలా ప్రజల మధ్య తిరిగేవారట ! ఈ కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కనుక్కోవడం, వాటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటే బాగుంటాయో, ప్రజల నుంచే తెలుసుకోవడం, తమ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సేకరించడం లాంటివి చేసే వారట ! ఈ అజ్ఞాత జీవితం నుంచి బయటికి వచ్చి, అంత:పురానికి చేరుకున్న తర్వాత తమ అనుభవాల తెలుసుకున్న నిజాలను పరిశీలించి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా శాసనాలు రూపొందించే వారట ! ఈ ప్రక్రియ కేవలం భారతదేశాన్ని పాలించిన రాజులే కాకుండా, విదేశీ రాజులు కూడా అవలంబించారని చెప్పే ఆధారాలు చాలా ఉన్నాయి. దీని వల్ల జన జీవన విధానంలో మార్పు వచ్చేది. ఆ రాజు పది కాలాలపాటు తన పాలనను సజావుగా సాగించేవాడు. ప్రజల మనుస్సులో నిలిచిపోయేవాడు. నేటి పాలకులు కూడా నాటి ఉత్తమ పాలకులను ఆదర్శంగా తీసుకునే తమ పాలనను సాగిస్తున్నామని చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. అందుకే, ప్రజల మధ్యకు వెళ్తున్నామని ప్రకటనలు చేయడం కూడా రోజూ చదవడమో, వినడమో చేస్తూనే ఉన్నాం. ఈ మధ్య పాలకులు, ప్రతిపక్షాలు అన్న తేడా లేకుండా జనంలో తిరగడానికే ఇష్టపడుతున్నారు. ఈ అక్టోబర్ నెలలో చలికి వణకాల్సిన ప్రజలు, రాజకీయ నాయకుల పాదయాత్రలతో గజగజా వణికిపోతున్నారు. ఓ రకంగా ఈ చలికాలం రాజకీయ నాయకులకు యాత్రాకాలంలా మారింది. అయితే, ఇప్పటికే పాద యాత్ర మొదలు పెట్టిన టీడీపీ, నేడో రేపో మనో పాద యాత్రను మొదలు పెట్టనున్న వైఎస్‌ఆర్‌సీపీ చెప్పేదేమంటే.. తాము ప్రజల కోసమే యాత్రలను చేపడుతున్నామని. కానీ, జనానికి తెలియదా ఈ రెండు పార్టీలు ఎవరి కోసం యాత్రలకు వస్తున్నాయో ! టీడీపీ మళ్లీ అధికారం కోసం జనంలో తిరుగుతుంటే, వైఎస్సార్‌సీపీ కొత్తగా అధికారం చేజిక్కించుకోవాలని యాత్రలు చేస్తున్నాయన్నది సకల జనులకు తెలిసిన సత్యమే ! గతంలో చంద్రబాబు ఏ విధానాలను వ్యతిరేకించాడో, ఇప్పుడు అవే విధానాలను అమలు చేస్తానని కాళ్లకు బొబ్బలు వచ్చేలా నడుస్తున్నడు. ఇక వైఎస్సార్‌సీపీ తరుపున పాదయాత్ర చేయాలని నిర్ణయించినా, ఆ యాత్ర చేసే నాయకుడు కూడా మొన్నటి వరకు కరువయ్యాడు. ఎందుకంటే, ఆ పార్టీ అధ్యక్షులు ఊచలు లెక్కబెడుతున్నడాయె ! ఆయన తప్ప అంతగా జనాకర్షణ నాయకుడు ఆ పార్టీలో లేడాయె ! దీంతో అంతో ఇంతో మాట్లాడగలిగే జగన్ చెల్లెనే రంగంలోకి దింపారు. ఈ పార్టీ యాత్ర చేయడంలో వెనుకున్న ముఖ్యోద్దేశం కూడా అందరికీ తెలిసిందే ! జగన్‌ను జైలు బయటకు తీసుకురావడం, ఆయన దోచుకున్న ప్రజాధనంపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరణ జరిగేలా చూడడం. కానీ, టీడీపీ, వైఎస్సార్సీపీ జనాముఖంగా తమ లక్ష్యాలను చెబుతాయా అంటే చెప్పవు. ఇవే కాదు ఏ పార్టీ కూడా చెప్పదు. అన్నీ చెప్పేది తమ యాత్ర జనం కోసమని, వారి సంక్షేమం కోసమని. అంటే, వీళ్లు తమను తాము పూర్వ కాలం నాటి ఉత్తమ రాజులతో పోల్చుకొమ్మని చెప్పకనే చెబుతారన్న మాట ! దీన్ని జనం నమ్మాలి. ఓట్లు రాల్చాలి. వీళ్లు గద్దెనెక్కాలి. తమ పనులు చక్కబెట్టుకోవాలన్నదే వీళ్ల తుది ఉద్దేశం. మరి వీళ్లు కూడా ఆ కాలపు రాజుల లాగే తమలో తిరిగితే జనం నమ్మేవారేమో గానీ, అలా చేయడం లేదు కదా ! పాదయాత్ర అన్న మాటే గానీ, అది పేరుకు మాత్రమే. వీళ్ల యాత్రను చూస్తే జనం కష్టాలను తెలుసుకోవడానికి కాదు.. విహార యాత్రకు వచ్చినట్లున్నారని అనుకునేలా ఉంటుంది. సకల సౌకర్యాలతో వెంట నడిచే వాహనాలు, డాక్టర్లు, స్పెషల్ వంటలు ఇలా ఇంకా చాలా చాలా ఉంటాయి. అయినా, వీళ్ల నమ్మకం వీళ్లది. గతంలో ఒకరు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము కూడా అలా వస్తామని భావిస్తున్నారు. కానీ, జనం ఆయన పాదయాత్ర చేసి, అధికారంలోకి వచ్చి, తమకు ఎలా శఠగోపాన్ని పెట్టారో, అంత త్వరగా మరిచిపోరు. అందుకే, టీడీపీ, వైఎస్సార్‌సీపీ పాదయాత్రలను జనం నమ్మే స్థితిలో లేరు. యాత్రలతో అధికారం వచ్చేదుంటే, ప్రపంచంలోని నాయకులంతా చెప్పులు కాదు.. కాళ్లరిగే దాకా నడిచేవారు. కానీ, అలా జరగడం లేదే ! మంచి చేశాం, భవిష్యత్తులో చేస్తాం అని ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించే వారే దేశాలను ఏలుతున్నారు. ఈ విషయాన్ని ఈ రెండు పార్టీలు తెలుసుకుంటే బెస్ట్ !