ఇదే చివరి గడువు తెలంగాణ ఇవ్వండి..

లేదా ఉద్యమ పార్టీలో చేరుతాం
అధిష్టానానికి కేకే అల్టిమేటంహైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :
ఇదే చివరి గడువు, ఇకనైనా తెలంగాణ ఇవ్వండి లేకుంటే ఉద్యమ పార్టీలో చేరుతామని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే తాము కఠిన   నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణరాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)ని తాము ఒక పార్టీగా చూడడం లేదని, ఉద్యమంగా భావిస్తున్నామని అందుకే తాము ఆ ఉద్యమంలో చేరాలనుకుంటున్నామని చెప్పారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ఒక ఉద్యమపార్టీ. టిఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా కెసిఆర్‌ ఆహ్వానించారు. కెసిఆర్‌ ఆహ్వానాన్ని మన్నించడంలో తప్పులేదనుకుంటున్నామని చెప్పారు. ”అవును…. కేసిఆర్‌తో మాట్లాడాను. తెలంగాణపైనే మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పార్టీ తెలంగాణను ఇచ్చేది లేదని కెసిఆర్‌ అన్నారు. మమ్మల్ని టిఆర్‌ఎస్‌లో చేరమన్నారు. ఎంపీలతో కూడా చర్చించి నిర్ణయం చెబుతామని ఆయనకు చెప్పానని” కెకె అన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉంటానో.. ఉండనో చెప్పలేనని అన్నారు. టి- కాంగ్రెస్‌ ఎంపీలు ఉంటారో ఉండరో వారే నిర్ణయించుకోవాలని అన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పిందన్నారు. సోనియాకు కోసం వచ్చినా సరే తెలంగాణపై నా వ్యాఖ్యలకు ఇప్పటికే కట్టుబడే ఉన్నానని అన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు కలిసి కృషి చేయాల్సి ఉందని అన్నారు. తాను పదవుల కోసం ఏనాడు పాకులాడలేదని అన్నారు. పదవులు ఆశించి పనిచేయలేదని అన్నారు. పదవులు, సీట్లు కాదు… తెలంగాణ సాధనే నా లక్ష్యం అన్నారు. ఈ వయసులో పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై తీర్మాణం చేయని అసెంబ్లీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. అయితే తమ భవిష్యత్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. ఎంపీలతో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని కేశవరావు చెప్పారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ సమస్యలను పట్టించుకోనందునే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. తెలంగాణ విషయంలో తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, విమర్శలు చేసే కాంగ్రెస్‌ నాయకులకు ఆయన హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటు తప్ప అధిష్టానంతో చర్చించే ఇతర అంశాలేవీ లేవని ఆయన అన్నారు.