ఇద్దరిని మింగిన ఈతసరదా

ఈతరాక ఇద్దరు బాలల మృతి

ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం

సూర్యాపేట,మే26(జ‌నంసాక్షి): ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు బావిలో మునిగి మృతిచెందిన సంఘటన నూతనకల్‌ మండలంలోని తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా, వీరి మృతదేహాలను శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వెలికితీశారు. గ్రామానికి చెందిన జూలూరి తరుణ్‌(13), గిలకత్తుల మధు(13)లకు గ్రామశివారులోని రామసముద్రం పెద్దచెరువు కింద నూతనంగా తవ్విన బావిలో వారి తండ్రుల సాయంతో వారం రోజులుగా ఈత నేర్చుకుంటున్నారు.

ఈక్రమంలో శుక్రవారం ఇద్దరు పిల్లల తండ్రులు పని నిమిత్తం బయటికి వెళ్లడంతో పిల్లలిద్దరే ఈత కోసం రోజూ వెళ్లే బావి వద్దకు వెళ్లారు. బావిలోకి దిగి ఈత కొడుతున్న క్రమంలో పూర్తిగా ఈత రాకపోవడంతో అందులోనే మునిగి మృతిచెందారు. చీకటి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అనుమానమొచ్చి బావి వద్దకు వెళ్లి చూడగా వారి బట్టలు ఒడ్డుపై ఉండడంతో బావిలో మునిగినట్లు గ్రహించారు. బావిలో 30 అడుగుల మేర ఉన్న నీటిని తొలగించేసరికి శనివారం తెల్లవారుజామున ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. జూలూరి రవి, ఉష దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉండగా.. కుమారుడు తరణ్‌ ఈతకు వెళ్లి మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అదేవిధంగా గిలకత్తుల పరమేష్‌, హైమవతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. చిన్న కుమారుడు మధు ఈతకు వెళ్లి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తికి తరలించినట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు.

తాజావార్తలు