ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచన లేదు

మరోసారి తేల్చి చెప్పిన సచిన్‌
బెంగళూర్‌, ఆగస్టు 30: రాహుల్‌ ద్రావిడ్‌ తప్పుకున్నాడు… హఠాత్తుగా వివిఎస్‌ లక్ష్మణ్‌ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. భారత దిగ్గజాలలో ఒక్కొక్కరే తప్పుకుంటున్న వేళ ఇక అందరి దృష్టీ సచిన్‌పై పడింది. మాస్టర్‌ రిటైర్మెంట్‌ ఎప్పుడు ప్రకటిస్తాడా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన తనకు లేదని మాస్టర్‌ బ్లాస్టర్‌ ఒక్క మాటలో తేల్చేశాడు. ప్రస్తుతం తాను ఆటను ఆస్వాదిస్తున్నానని , తన చేతిలో బ్యాట్‌ ఇబ్బందిగా అనిపించిన రోజున రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. క్యాస్ట్రాల్‌ బ్యాట్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న సందర్భంగా మాస్టర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వస్తే అందరికీ చెప్పే నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించాడు. తాను రికార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించనని మాస్టర్‌ చెప్పాడు. రికార్డులనేవి ఏదో ఒకరోజు బద్దలవుతాయని , సెహ్వాగ్‌ తన డబుల్‌ సెంచరీ రికార్డు బ్రేక్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. భవిష్యత్తులో కోహ్లీ , రైనా , ఉన్ముక్త్‌ లాంటి క్రికెటర్లు మరిన్ని మైలురాళ్ళు అందుకుంటారన్నాడు. ఇదిలా ఉంటే పెర్ఫార్మెన్స్‌ అండర్‌ ప్రెజర్‌ అవార్డు అందుకున్న గౌతం గంభీర్‌ శ్రీలంకలో జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్‌లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేసాడు. గత రెండు ఎడిషన్లలోనూ జట్టు నిరాశపరిచినప్పటకీ… ఈ సారి 100 శాతం ప్రదర్శన కనబరుస్తామని గంభీర్‌ చెప్పాడు.