ఇమ్రాన్‌ఖాన్‌ డిశ్చార్జి

ప్రజాక్షేత్రంలో పనిచేస్తా : ఇమ్రాన్‌
లాహోర్‌, (జనంసాక్షి) :
పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ తెహ్రీక్‌ -ఏ – ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇటీవల జరిగిన పాకిస్థాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన వేదికపైకి వెళ్తూ కిందపడిన విషయం తెలిసిందే. వెన్నెముక, ప్రక్కటెముకలకు తీవ్ర గాయాలవడంతో రెండువారాలకు పైగా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందాడు. షౌకత్‌ ఖానం మొమోరియల్‌ ఆసుపత్రి వైద్యులు ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలందించారు. దీంతో త్వరగా కోలుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ ఆస్పత్రి నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వాహుకులు ఒక ప్రకటన విడుదల చేశారు. వెన్నెముకకు ఆసరా కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పట్టీతో ఆయన మంగళవారం ఎవరి సాయం లేకుండా నడిచాడని వెల్లడించారు. ఈ పట్టీని నాలుగునుంచి ఆరు వారాల పాటు ధరించాలని వారు తెలిపారు. ఆస్పత్రినుంచి వెళుతూ ఇమ్రాన్‌ ఖాన్‌ తన శ్రేయోబిలాషులకు, మద్దతు దారులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన భాగోగులు కోరేవారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ప్రజలకు సేవలందించడమే తన ఏకైక లక్ష్యమన్నారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ చర్యలను మరింత వేగవంతం చేస్తానని చెప్పారు.