ఇవాళ తెలంగాణ అడ్వొకేట్లు ‘చలో సంగారెడ్డి’

హైదరాబాద్‌: తెలంగాణ ద్రోహులకు బుద్ది చెప్పాలని ఇవాళ తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో సంగారెడ్డి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణలో తెలంగాణ వాదమే లేదని వ్యాఖ్యనించడంతో వారు ఈ ఆందోళనకు దిగారు. ఇవాళ సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసాన్ని న్యాయవాదులు ముట్టడిస్తారు.

అడ్వొకేట్లకు ముట్టడికి అనుమతిలేదు: ఎస్పీ

తెలంగాణ వాదుల ఉద్యమానికి తరచూ ఆటంకం కలిగించే సీమాంధ్ర ప్రభుత్వం యధావిధిగా అడ్వొకేట్ల చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని కూడా ఆపేందుకు కుట్రలు మొదలు పెట్టింది ఈమేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు, పట్టణంలో ధర్నా చేసేందుకు న్యాయవాదులకు అనుమతిలేదని జిల్లా ఎస్పీ అన్నారు. ఎలాంటి ధర్నాలు చేసినా, ముట్టడి కార్యక్రమాలు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలంగాణవాదులను హెచ్చరించారు.

అనుమతించక పోవడం అప్రజాస్వామికం

తెలంగాణ న్యాయవాదుల ‘చలో సంగారెడ్డి కార్యక్రమానికి జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతించక పోవడంపై టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షడు ఆర్‌. సత్యనారాయణ నిరసన తెలియజేశారు. సీమాంధ్ర నేతలు చంద్రబాబా, షర్మిళ పాదయాత్రలకు అనుమతించిన ప్రభుత్వం తెలంగాణ అడ్వొకేట్ల చలో సంగారెడ్డికి అనుమతించక పోవడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. ఏదీఏమైనా చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వమే అడ్వొకేట్లకు రక్షణ కల్పించాలని లేకుంటే జరుగబోయే పరిణామాలకు సీమాంధ్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.