ఈనెల 30 డెడ్‌లైన్‌

తెలంగాణపై తేల్చకపోతే పార్టీ వీడుతాం
చాకో వ్యాఖ్యలపై టీ ఎంపీల ఫైర్‌
హైదరాబాద్‌, మే 19 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈనెల 30వ తేదీలోపు స్పష్టమైన నిర్ణయం తీసుకోని పక్షంలో కఠినమైన నిర్ణయాలు తప్పవని టీఎంపీలు హెచ్చరించారు. పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ జి. వివేకానంద నివాసంలో ఆదివారం సమావేశమైన మందా జగన్నాథం, రాజయ్యలు తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి పిసి చాకో వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానపరిచేవిగా ఉన్నాయన్నారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించడం సరైంది కాదన్నారు. చాకో చెప్పినట్లుగా యూపీఏ ఎజెండాలో లేనప్పుడు సీఎంపీలో ఎలా వచ్చింది, రాష్ట్రపతి ఉభయ సభల్లో ప్రసంగంలో ఎందుకు చోటుచేసుకుందని ప్రశ్నించారు. పిసి చాకోను సోనియా చెప్పమన్నారా, రాహుల్‌ చెప్పించారా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. నిన్నగాక మొన్న తెలంగాణ అంశం వేగంగా సాగుతున్నదని చెప్పి చాకోనే మళ్లీ నాలుగు రోజుల తర్వాత అసలు యూపీఏ ఎజెండాలో లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక తెలంగాణ ప్రజలను పిచ్చోళ్లుగా భావిస్తున్నారా అని నిలదీశారు. భువనగిరి బహిరంగ సభలో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని ప్రకటించిందన్నారు. సీఎంపీలో పెట్టినప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై లేదా స్పష్టం చేయాలని చాకోను డిమాండ్‌ చేశారు. చాకో ప్రకటన వెనుక ఉన్నదెవరో స్పష్టం చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. వెయ్యిమంది విద్యార్థులు ఎలాంటి హింసకు పాల్పడకుండా తమ ప్రాణాలను గాలిలో కలిపేసుకున్నారన్నారు. ఇలాంటి ప్రకటనల వల్ల కాంగ్రెస్‌పై ప్రజలు దురభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయన్నారు. విషయాన్ని తేల్చకపోతే నెలాఖరులోగా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. గతంలో ఎన్నోసార్లు డెడ్‌లైన్లు పెట్టినా ఇది మాత్రం చిట్టచివరిదేనన్నారు. అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడ బోమని హెచ్చరిచారు. ఏపార్టీలో చేరుతారని ప్రశ్నించగా నియోజకవర్గాల కార్యకర్తలు, ప్రజల నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారా అనే ప్రశ్నకు ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్న వేశారు.