ఈ పాస్‌తో రేషన్‌ అక్రమాలకు చెక్‌

దొంగ రేషన్‌ కార్డుదారులకు అందని బియ్యం 
వరంగల్‌,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పౌర సరఫరాల శాఖలో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ-పాస్‌ విధానం అమలు చేస్తున్నారు. దీంతో రేషన్‌ దుకాణాల్లో పెద్ద ఎత్తున బియ్యం మిగులుతోంది. ఈ విధానంతో తప్పనిసరిగా రేషన్‌ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో బడాబాబులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కొందరికి రేషన్‌ కార్డులుండగా.. దీంతో కొందరు మొహమాటంతో వెళ్లడం లేదు. అదీకాక గ్రామాల్లో ఇంతకాలం గోప్యంగా ఉన్న బోగస్‌ కార్డులు, అనర్హుల కార్డులు తాజాగా అందరికీ తెలిసిపోయింది. దీంతో 5-10శాతం మంది రేషన్‌ సరుకులు తీసుకోవడం లేదు. బోగస్‌, బినావిూ కార్డులకు బియ్యం పంపిణీ నిలిచిపోయింది. దీంతో అనూహ్య రీతిలో బియ్యం ఆదా అవుతోంది. జిల్లాలోని పౌర సరఫరాలశాఖలో సరికొత్త విధానాలు అమలు చేయడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. రేషన్‌ వ్యవస్థ పూర్తిగా గాడిలోకి వచ్చింది. రేషన్‌ దుకాణాల్లో చాలా వరకు అవినీతి అక్రమాలు తగ్గిపోయాయి. ఈ-పాస్‌ విధానంతో బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడగా… పోర్టబులిటీ విధానంతో ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకొనే సౌకర్యం లభించింది. ఈ విధానంలో రేషన్‌ తీసుకొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు రేషన్‌ దుకాణాల్లో ఎలక్టాన్రిక్‌  కాంటాలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఎలక్టాన్రిక్‌   కాంటాలతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో అక్రమాలకు
అడ్డుకట్ట పడింది. జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కలెక్టరేట్‌ నుంచి అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను కలెక్టరేట్‌ నుంచి మానిటరింగ్‌ చేయడం సులువుగా మారింది.  ఇప్పటికే సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాంల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వెళ్లే స్టేజీ-1 వాహనాలకు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు వెళ్లే స్టేజీ-2వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలు పెట్టి.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మానిటరింగ్‌ చేస్తున్నారు. దీంతో వాహనాలు పక్కదోవ పట్టకుండా.. సరైన ప్రదేశాలకు నేరుగా వెళ్తున్నాయి.  ఈ-పాస్‌ విధానం ద్వారా ప్రతి రోజు బియ్యం ఎంత మందికి పంపిణీ చేశారు. ఏయే లబ్ధిదారులకు తమకు కేటాయించిన కోటా బియ్యం పొందారు. ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాలి.. మిగిలిన కోటా ఎంత… తదితర లెక్కలు పూర్తిగా ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా ఉన్నతాధికారులకు తెలిసిపోతున్నాయి. జిల్లా స్తాయిలో డీసీఎస్‌వో, ఏసీఎస్‌వోలు నిత్యం మానిటరింగ్‌ చేస్తుండటంతో.. సరుకులు పారదర్శంగా ఇచ్చేందుకు అవకాశం లభించింది. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో పోర్టబిలిటీ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో రేషన్‌ కార్డుదారులు ఏ రేషన్‌ షాపుకైనా వెళ్లి వేలిముద్రలు వేసి సరుకులు పొందుతున్నారు. ఈ విధానంతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయి. డీలర్ల కోసం కార్డుదారులు వేచి చూసే పరిస్థితి నుంచి.. కార్డుదారుల కోసం డీలర్లు వేచి చూసే పరిస్థితి వచ్చింది.