ఈ బంధం బలమైనదే

థాయిలాండ్‌-భారత్‌ కీలక ఒప్పందాలు
నేరస్తుల అప్పగింత
ఖైదీల మార్పిడి
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు
బ్యాంకాక్‌, (జనంసాక్షి) :
భారత్‌ – థాయిలాండ్‌ మధ్య స్నేహ బంధం మరింత బలపడాలని ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, యింగ్లిక్‌ శినవాత్రా అన్నారు. థాయిలాండ్‌లో పర్యటన కోసం మన్మోహన్‌ గురువారం బ్యాంకాక్‌కు చేరుకున్నారు. ఆ దేశ ఉప ప్రధాని యుకోల్‌ లిమ్లంతాంగ్‌ దంపతులు ఆయనకు స్థానిక విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మన్మోహన్‌ థాయిలాండ్‌ ప్రధాని యింగ్లిక్‌ శినవాత్రతో భేటీ అయ్యారు. భారత్‌-మయన్మార్‌-థాయిలాండ్‌ దేశాలను కలిపే 3,200 కిలోమీటర్ల అంతర్జాతీయ రహదారి నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ రహదారి నిర్మాణం 2016 నాటికి పూర్తవుతుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ రహదారి కోసం భారత్‌ ఇప్పటికే మయన్మార్‌కు 500 మిలియన్‌ డాలర్ల రుణ సహాయాన్ని అందజేసింది. అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణమయ్యే రహదారి పై ప్రస్తుతం సమావేశమయ్యామని, జూన్‌, జులై మాసాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల సమూహాలు ఇచ్చిపుచ్చుకోవడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. త్వరలో మూడు దేశాల మంత్రుల కమిటీ భేటీ అయి అంతర్జాతీయ రహదారిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని మూడు దేశాలు స్వయంసమృద్ధి సాధికారిత సాధించే దిశగా చర్చలు జరుపుతారని తెలిపారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో సృజనశీలత, పరిజ్ఞానం బదలాయింపు, నేరస్తుల అప్పగింత, ఖైదీల మార్పిడి, ఉక్కు, విద్యుత్‌, పెట్రోకెమికల్స్‌తో పాటు వివిధ సేవలు ఇచ్చిపుచ్చుకోవడంపై చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నారు.