ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్‌రే లాంటిది

సర్వేలో పాల్గొననివారు సమాచారం ఇవ్వొచ్చు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: కులగణన సర్వేలో పాల్గొననివారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియకు సర్వే సమాచారం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కులగణన సర్వే మొదలుపెట్టడానికి సుదీర్ఘ కసరత్తు చేశాం. ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్‌రే లాంటిది. కులగణనతో దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలోనే తొలిసారి కులగణన సర్వేను మేం పూర్తి చేశాం. సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల అమలుకు సర్వే సమాచారం వాడతాం. కులగణన జరగవద్దని కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి.. సర్వే జరిగిన తీరును, సమాచారాన్ని ప్రజల ముందుంచుతాం. వెనుకబడినవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది’’ అని భట్టి చెప్పారు.