ఉండవల్లీ ! నువ్వు పెద్దాపురం వేశ్యవు తెలంగాణ సత్తాచాటుతాం

నిప్పులు చెరిగిన ఎంపీ పొన్నం
హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) :
ఉండవల్లీ నువ్వు పెద్దాపురం వేశ్యతో సమానం.. నువ్వా హైదరాబాద్‌ గురించి మాట్లాడేది తెలంగాణ సత్తా ఏంటో చూపుతామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్‌ బొత్స, కాంగ్రెస్‌ హైకమాండ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుడైన ఉండవల్లి అసత్యాలను వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. తమను రజాకార్లుగా పోలిస్తే ఆయనను పెద్దాపురం వేశ్యతో పోల్చాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రజాకార్లు, ఖాసీం రజ్వీలతో  పోల్చిన ఉండవల్లి తన వ్యాఖ్యలు ఉపంసహరించుకోవాలని, లేకుంటే రజ్వీ చర్యలను చవిచూడాల్సి వస్తుందన్నారు. సంఖ్యాబలం తక్కువ ఉందని మా గొంతు నొక్కేస్తారా అని ప్రశ్నించారు. సమైక్య సభకు హాజరైన బొత్స ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు కాడని స్పష్టం చేశారు. హైకమాండ్‌పైనా పొన్నం మండిపడ్డారు. తెలంగాణపై ఇక సమావేశాలు ఉండవని, నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన అధిష్టానం వచ్చిన వారందరికీ ఎందుకు అపాయింట్‌మెంట్లు ఇస్తోందని నిలదీశారు. ఢిల్లీలో తమ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో పొన్నం విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు కరీంనగం సభలో సోనియా చేసిన ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన ఉండవల్లి వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. తెలంగాణ గురించి, తెలంగాణవాదం గురించి సోనియా మాట్లాడిన మాటలకు
ఉండవల్లి తెలుగులో అనువాదం చేసిన తీరును వీడియోలో చూపారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. ఉండవల్లిపై ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆనాడు కరీంనగర్‌ సభలో సోనియా చెప్పిన వ్యాఖ్యలను తెలుగులోకి తర్జుమా చేసిన ఉండవల్లి ఆ విషయాన్ని అప్పుడే మరిచిపోయారా? అని ప్రశ్నించారు. 2004లో తెలంగాణకు అనుకూలమని టీఆంఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని మరిచిపోయారా? అని నిలదీశారు. కరీంనగం సభలో సోనియా ప్రసంగాన్ని అనువాదం చేసిన ఉండవల్లికి మతి తప్పిందా? అని దుయ్యబట్టారు. మా తెలంగాణ మాక్కావాలని కోరుతున్నాం తప్పా ఇతర ప్రాంతాన్ని కోరడం లేదన్నారు. 40 ఏళ్ల చరిత్రను వక్రీకరిస్తూ ఉండవల్లి మాట్లాడడంపై మండిపడ్డారు. ఆయనది నాలుకా.. తాటిమట్టా? అని ప్రశ్నించారు. ఆయన తీరును చూసి వసంతనాగేశ్వరరావు వంటి ఆంధ్ర ఉద్యమ నేతలు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను రజాకార్లతో పోల్చిడంపై పొన్నం మండిపడ్డారు. తమను రజాకార్లతో పోల్చిన ఉండవల్లిపై దాడులు జరిగితే తాము బాధ్యులం కాదన్నారు. ఉండవల్లి ఊసరవెల్లి మాటలు మాట్లాడడం మానుకొని సత్యాలను, వాస్తవాలను ప్రజలకు తెలిసేలా వ్యవహరిస్తే మంచిదని పొన్నం సూచించారు. జై ఆంధ్రప్రదేశ్‌ అంటున్న ఉండవల్లి రాజమండ్రి సభకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. తెలంగాణపై సీమాంధ్ర పెత్తందార్ల పెత్తనం సాగదని తేల్చిచెప్పారు. తెలంగాణ వాదాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మందే ఉన్నారు… 175 మంది ఎమ్మెల్యేలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే రాష్ట్ర విభజనపై తీర్మానం ఎలా చేస్తారని సవాలు చేస్తారా? అని ప్రశ్నించారు. సంఖ్యాబలం తక్కువ ఉంటే నోరు నొక్కేస్తారా? తక్కువ మంది ఉన్న తెలంగాణ నేతల మాటలకు విలువల లేదా? అని మండిపడ్డారు. ఉండవల్లి, కేవీపీ వంటి నేతలంతా సమైక్య ముసుగులో పార్టీ నేతలందరినీ వైఎస్సార్‌సీపీలో కలిపేందుకు రహస్య అజెండాతో పని చేస్తున్నారని ఆరోపించారు. తాము గట్టిగా మాట్లాడితే.. వారు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. అదే విూరు వైఎస్సార్‌సీపీలోకి వెళ్తే తప్పు కాదా? అని ధ్వజమెత్తారు. సోనియా మాటనే కాదంటున్న వారు కాంగ్రెస్‌ వాళ్లెలా అవుతారని ప్రశ్నించారు.
బొత్సపై ధ్వజం..
సీమాంధ్ర నాయకత్వం కోసం బొత్స పోటీ పడుతున్నారని పొన్నం ధ్వజమెత్తారు. రాజమండ్రిలో జరిగిన సభకు పీసీసీ అధ్యక్షుడి ¬దాలో బొత్స పాల్గొనడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్టాల్రుంటే తప్పేమిటని ప్రశ్నించిన బొత్స సమైక్య సభకు ఎలా వెళ్తారని నిలదీశారు. సోనియా ఆదేశించని సభలకు ఆయన ఎలా వెళ్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు బొత్స ఈ రోజు నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాడని స్పష్టం చేశారు. అధిష్టానం కూడా కనీస జ్ఞానం లేకుండా అందరినీ ఢిల్లీ ఎందుకు రానిచ్చిందని మండిపడ్డారు. త్వరలోనే నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి అసత్యాలను తిప్పికొడతామని తెలిపారు.