ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిభిరం

సెప్టెంబర్ 3 , 4వ తేదీల్లో నిర్వహణ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): చేతన ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారి సంయుక్త ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి సౌజన్యంతో ఉప్పల నాగలింగం మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిభిరంను ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ ఆప్ సూర్యాపేట అధ్యక్షులు డాక్టర్ రమేష్ చంద్ర తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఈ వైద్య శిభిరానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారిచే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేయనున్నట్లు తెలిపారు.క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణహాని తప్పుతుందన్నారు.ఎంతకీ మానని పుండు, కురుపు,పుట్టుమచ్చలు, పులిపిరికాయలలో మార్పు రావటం, చాలాకాలంగా గొంతు బొంగురుపొయి ఉండటం, వీడని దగ్గు, రోజుల తరబడి అజీర్ణం, ఆహరాన్ని మింగేటప్పుడు కష్టంగా ఉండటం, జీర్ణాశయ, మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు,స్త్రీలలో తెల్లబట్ట అవటం, సకాలంలో బహిష్టు రాకపోవడం,రొమ్ము ప్రదేశంలో,మరే చోటైనా వాపు రావడం, గడ్డ కట్టడం వంటి లక్షణాలు ఉంటే ఈ వైద్య శిభిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఆత్యాధునిక వైద్య పరీక్షలు అవసరమైన వారికి నిపుణులైన వైద్య బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా రిపోర్టులు ఇవ్వనున్నట్లు చెప్పారు.అవసరం ఉన్నవారికి మందులను కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.అనుమానిత లక్షణాలు ఉన్నవారు 9849835276, 9502519144 , 8374543170 నెంబర్లలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అప్ సూర్యాపేట ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్, గ్లోబల్ ఎక్స్టెన్షన్ టీం కోఆర్డినేటర్ ఉప్పల రాజేంద్రప్రసాద్, లయన్స్ సర్వీస్ కోఆర్డినేటర్ రాచర్ల కమలాకర్, ఆర్సి చిలుముల శ్రీనివాసరెడ్డి , బిక్షపతి యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, మార్కెటింగ్ చైర్మన్ వెంకన్న నాయక్, జడ్సీ వంగవీటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.