ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ నష్టాల్లోకి..

` బస్ భవన్ వద్ద బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
` ఎండి నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో సర్కారు నడపట్లేదు.. సర్కస్ నడుపుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బస్ భవన్ వద్ద నిరసనలో భాగంగా ఆయన మాట్లాడారు. ఉదయం మా పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు.. తర్వాత వెళ్లవచ్చన్నారు. ఇక్కడికి వచ్చాక మళ్లీ అరెస్టు చేస్తున్నారు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఉచిత బస్సు పథకం పెట్టి ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారు. ఆ నష్టాలను భరించాల్సింది ప్రభుత్వమే. మహిళలకు ఉచిత బస్సు కల్పించి.. పురుషులకు రెట్టింపు వసూళ్లు చేస్తున్నారు. ఒక్కో కుటుంబంపై టికెట్ ధరల భారం పెరిగింది. ఆర్టీసీ బస్సు పాసుల ధరలు 25 శాతం పెంచారు. మెట్రో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీని తరిమేశారు. మెట్రో, ఆర్టీసీ లేకుండా మొత్తం ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ అన్నారు. అనంతరం బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి భారత రాష్ట్ర సమితి నేతలు వినతిపత్రం అందజేశారు. కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు వెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్ భవన్‌కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు గులాబీ నేతలను గృహనిర్బంధం చేసారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేకానంద గౌడ్, శంభీర్ పూర్ రాజు, సాయుబాబా తదితరులను కూడా గృహనిర్బంధం చేశారు. ఇక మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని చలో బస్ బవన్ కార్యక్రమానికి బయలుదేరుతున్న సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. అంతేకాకుండా… బీఆర్‌ఎస్ బస్ భవన్ పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.