ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి అభ్యున్నతి కొరకు స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయడం తెలిసిన విషయమే.అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో 2022-23కు సంబంధించి 100 మందికి ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమానికి నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అధికారి దయానంద రాణి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ చిట్టిపాక రాములు శుక్రవారం తెలిపారు.ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ అభ్యర్థులు సంవత్సరానికి రూ. 3 లక్షల ఆదాయం మించని వారు ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ 2న అర్హత పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అక్టోబర్ 19, 2022 నుంచి మార్చి 18, 2023 వరకు 5 నెలల పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.శిక్షణ సమయంలో నెలవారి కాస్మోటిక్ చార్జీలతో పాటు, రూ.2500 విలువ గల స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు.వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9989129935 లో సంప్రదించాలని తెలిపారు.