ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య చారిత్రక ఘట్టం
గొయాంగ్(ద.కొరియా): ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఓ చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. ఇరువురు దేశాధినేతలు కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. పాత వైరాలను పక్కన పెట్టి ఇరు దేశాలు శాంతి బాట పట్టాయి. ఇరు దేశాల మధ్య ఇలాంటి సానుకూల వాతావరణం ఏర్పడటంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. కొరియా యుద్ధం అనంతరం దాదాపు 65ఏళ్ల తర్వాత ఉ.కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఈరోజు ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ద.కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌ల మధ్య చరిత్రాత్మక సమావేశం జరిగింది. ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్ వద్ద కిమ్ చిరునవ్వుతో మూన్ జే ఇన్‌తో కరచాలనం చేశారు. మూన్ కూడా చిరునవ్వుతో కరచాలనం చేస్తూ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
అనంతరం కిమ్ జోంగ్ ద.కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్ జే ఉ.కొరియా భూభాగంలోకి వెళ్లారు. ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. తర్వాత కిమ్ ద.కొరియాలో అడుగుపెట్టారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పన్‌ముంజుమ్‌లోని మూడంతస్థుల భవనం ‘పీస్ హౌస్’లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. యుద్ధం తర్వాత కొరియా దేశాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి.
సమావేశం ప్రారంభానికి ముందు కిమ్ తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని మూన్ జే ఇన్‌తో అన్నారు. కొత్త చరిత్ర ప్రారంభానికి ముందు సానుకూల సంకేతాలు ఇవ్వడానికి .. నిజాయితీతో, స్పష్టమైన ఆలోచనా విధానంతో తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉత్తర కొరియాలో పెద్ద మొత్తంలో ఉన్న అణ్వాయుధ సంపత్తి గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య గొప్ప ఒప్పందం జరిగే అవకాశం ఉందని, ఇది కొరియా ప్రజలందరికీ చక్కటి బహుమతి అవుతుందని మూన్ అన్నారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా సదస్సుకు హాజరయ్యారు. మూన్‌తో పాటు ఆయన నిఘా విభాగం చీఫ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ హాజరయ్యారు.
కొరియా దేశాల మధ్య సత్సంబంధాల ఏర్పాటుకు కిమ్ మనస్ఫూర్తిగా చర్చల్లో పాల్గొన్నారని కొరియన్ మీడియా పేర్కొంది. కానీ అణుసంపత్తి విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్న ఫొటోలను అంతర్జాతీయ మీడియాలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. మే లేదా జూన్‌లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది.