ఉత్తర తెలంగాణలో వర్ష బీభత్సం

బాన్సువాడలో కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
ఐదుగురు మృతి
నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) :
నూతన ఆర్థిక సంవత్సరం వస్తువస్తూనే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. సోమవారం సామవారం ఉన్నట్టుండి కురిసిన వడగళ్ల వానలతో రైతులు, ప్రజలు అతలాకుతలం అయ్యారు. కొట్లల్లో పంటనష్టం సంభవించింది. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మృత్యుపట్టంగా మారింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ధాటికి ఓ పాఠశాల భవనం కూలి నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రణయ్‌ మృతిచెందగా, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. దమ్మన్నపేటలో గుండ్లపోశం పిడుగుపాటుతో మృతిచెందాడు. దేశాయిపేట సహకార సంఘం కార్యదర్శి హనుమండ్లు చెట్టుకూలి మృత్యువాతపడ్డాడు. ఈదురుగాలులకు అనేక స్తంభాలు నేలకూలాయి. బీర్కురులో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. బాన్సువాడలో వందకుపైగా ఇళ్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో పట్టణమంతా అంధకారమయమైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసి పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, వేలాది ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. వరంగల్‌ జిల్లా జనగామ డివిజన్‌లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూను ఆదేశించారు. భారీ నష్టం వాటిల్లిన నిజామాబాద్‌లో వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని కోరారు. అలాగే మరోరెండు చోట్ల పిడుగుపాటు, చెట్లు కూలి ఇద్దరు మృతిచెందినట్లు తెలిసింది.