ఉద్యోగాల కోసం భవనమెక్కిన డీఎస్సీ అభ్యర్థులు

హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) :
ఉద్యోగాలివ్వాలని కోరుతూ డీఎస్సీ`2012 ఉద్యోగులు గురువారం తెల్లవారుజామున నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో గల సంక్షేమ భవన్‌పైన ఏడవ అంతస్తుపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ`2012లో ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తొలగించిన తమను తిరిగి చేర్చుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేసినా పట్టించుకోక పోవడంతో ఆందోళనను తీవ్రతరం చేశారు. సుమారు 150మంది తొలగించబడిన డీఎస్సీ అభ్యర్థులు తెల్లవారు జామున  చేతుల్లో పెట్రోల్‌ బాటిళ్లు పట్టుకుని ఆందోళన ప్రారంభించారు. తమకు న్యాయం చేస్తామని ఎన్నోసార్లు మాటిచ్చిన పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు ఉద్యోగాలిస్తామని ఖచ్చితమైన హామీనిస్తేనే క్రిందకు దిగుతామని లేకుంటే మాత్రం సామూహికంగా ప్రాణాలు కోల్పోయేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికి వారు మాత్రం ససేమిరా అంటున్నారు. ఏడో అంతస్తుపైకి ఎక్కిన వారు డోర్లు మూసేసుకున్నారు. తమపై ఏవైనా ప్రయోగాలు చేయాలని చూస్తే మాత్రం దూకడమేకాక, పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంటామని అభ్యర్థులు హెచ్చరించారు. పదిగంటల వరకు కూడా ఆందోళనకారులతో చర్చించే విషయమై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేతల మాటలకు విలువ లేకుండా పోయిందని ఉద్యోగం కోల్పోయిన ఓ అభ్యర్థి రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నిర్ణయాలకు ప్రాధాన్యత ఉంటుందని బావిస్తే కిరణ్‌ సర్కార్‌లో మాత్రం పాలకులే తుంగలోతొక్కుతున్నారని ఆరోపించారు. మంత్రి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినా కూడా అమలు కాలేదన్నారు. 11 గంటల తర్వాత పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి అందోళనకారులను శాంతింప చేసేందుకు ప్రయత్నించినా కూడా వారు వినలేదు. సూపర్‌ న్యూమరీ పోస్టులు క్రియేట్‌ చేస్తామని కూడా హామీ ఇచ్చి, అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా చర్చకు అవకాశం కల్పించలేదన్నారు. తమకిచ్చే ఉత్తర్వులు మాత్రమే ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, ఖచ్చితమైన హామి కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి హైదరాబాద్‌లో లేనందున సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని పోలీస్‌ ఉన్నతాధికారి వచ్చి చెప్పినా కూడా వినలేదు. ప్రెసిడెన్షియల్‌ రూల్‌ అంటూ జీఓ 8ను తెచ్చి తమ జీవితాలతో చలగాటం అడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మొదటి జీఓ సమయంలో లేని ప్రెసిడెన్షిల్‌ ఆర్డర్స్‌ రెండో జాబితాలో ఎందుకు వర్తింపచేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పార్థసారథి మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ ఉద్యమం విరమించాలి, శాంతియుతంగా పరిష్కరిస్తామన్నారు. న్యాయశాఖ, విద్యాశాఖ సమన్వయంతో పనిచేస్తుందన్నారు. న్యాయపరమైన చిక్కులు రావడం వల్లే ఆలస్యం అవుతుందన్నారు. పరిష్కారం చేసేసమయంలో తొందర పడితే మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తున్నామన్నారు. శుక్రవారం క్యాబినెట్‌లో చర్చించేందుకు ప్రయత్నిస్తామన్నారు. న్యాయం చేసేందుకే తమ ప్రయత్నం అన్నారు. తెల్లవారుజామునుంచి ఆందోళన చేస్తున్న అభ్యర్థులు ఎట్టకేలకు ఆందోళనను విరమించారు. అధికారులు స్పందించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఆందోళనకారులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. అయినా కూడా అభ్యర్థులు వెనక్కితగ్గలేదు. మంత్రితో మాట్లాడిరచే నెపంతో భవనంపైకి వెళ్లిన పోలీసు అధికారులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 2012 డీఎస్సీలో తమకు ఉద్యోగాలిచ్చినట్లే ఇచ్చి రద్దుచేశారని ఆరోపిస్తూ గత ఆరునెలలుగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు సమస్యపై మరింత పట్టు సాధించేందుకు గాను తెల్లవారుజామున ఆరు గంటలకే మాసాబ్‌ట్యాంక్‌ వద్దగల సంక్షేమ భవన్‌లోని ఏడో అంతస్తుపైకి ఎక్కి న 30మందిఅభ్యర్థులు తమను రాష్ట్రపతి రూల్స్‌ అంటూ సెలెక్షన్‌ జాబితాలో పెట్టినాక తొలగించారని, ఇదేం తవరకు న్యాయమని వారు పేర్కొంటూ ఆందోళనకు దిగారు. ఉదయం ఆరుగంటలకు భవనంపైకి ఎక్కిన ఆందోళనకారులను ఎట్టకేలకు అయిదు గంటల సమయంలో పోలీసులు చాకచక్యంగా క్రిందకు దించడమేకాక అరెస్ట్‌ చేశారు. ఉదయం నుంచి ఉద్రిక్తంగా ఉన్న సంక్షేమభవన్‌ ప్రాంతం ఆందోళనకారులను అరెస్ట్‌ చేయడంతో ప్రశాంతంగా మారింది.