ఉద్యోగుల వైద్య ఖర్చులపై ఆంక్షలు వద్దు

టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): ఉద్యోగుల వైద్య ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితి విధిస్తే, ఉగాది పండగ నుంచి అమలు చేయనున్న ఆరోగ్యకార్డు పథకంలో తాము చేరేది లేదని టీఎన్జీవో స్పష్టం చేసింది. సోమ వారంనాడు టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారులు సంఘం కార్యవర్గం సమా వేశమైంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఉద్యోగులు వైద్యపరీక్షలు చేయించు కునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అందుకు అయ్యే ఖర్చును భరించాలని సమావేశం అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పీఆర్సీ కాలపరమితిని ఆరు నెలలకు కుదించాలన్నారు. పీఆర్సీపై తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్కుషాపులు నిర్వహిస్తామని, మే నెలాఖరులోగా ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందజేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, 610జీవో అమలు, హెచ్‌ఓడీలలో ఫెయిర్‌ షేర్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లపై మేలో హైదరబాద్‌లో 204 శాఖాధిపతుల కార్యాలయాల వద్ద ప్రతీ రోజు నిరసనలు చేపట్టనున్నట్లు దేవీప్రసాద్‌ తెలిపారు. తెలంగాణ సాధనకు తెలంగాణ రాజకీయ జెఎసి పిలపునిచ్చిన ‘సంసద్‌’ యాత్రను విజయవంతం చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ యాత్ర సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా, ఆజాద్‌లను కలవనున్నట్లు చెప్పారు.