ఉపాధ్యాయుల ధర్నా

సిపిఎస్‌ రద్దుకు నేతల డిమాండ్‌

విజయవాడ,జూలై11(జ‌నం సాక్షి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్‌ వద్ద ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రదేశానికి పోలీసులు భారీగా మోహరించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ… సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అడ్‌ హక్‌ సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి ,అన్ని కేడర్ల పదోన్నతులు చేపట్టాలని తెలిపారు. స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో పండిట్‌, పిఈటీ పోస్టులను అప్‌ గ్రేడ్‌ చేయాలన్నారు. అప్‌ గ్రేడ్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, కత్తి నరసింహా రెడ్డిలు ధర్నాకు మద్దతు తెలిపారు.ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 17 నుంచి ఆమరణ దీక్ష చేపడతామని తెలిపారు. ఉ పాధ్యాయుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.