ఉపాధ్యాయుల మహాధర్నా
డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
విజయవాడ,జూలై11(జనం సాక్షి): విజయవాడ ధర్నా చౌకకకలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ధర్నా మహా ధర్నాగా కొనసాగుతోంది. న్యాయపరమైన తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అడుగడుగునా పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది ఉపాధ్యాయులు అరెస్టు అయ్యారు. టోల్ గేట్లు, రైల్వేస్టేషన్లు , బస్టాండ్లులో పోలీసుల నిఘా పెరిగింది.ప్రభుత్వం ఎంత అణచివేసినా పోరాటం ఆగదని ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత అరికట్టాలని, 398 రూపాయల జీతంతో పనిచేసే ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పదిహేనేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించాలన్నారు. 2014 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పిడిఎఫ్ ఎంఎల్సీ లు బొడ్డు నాగేశ్వరరావు ,కత్తి నరసింహా రెడ్డి లు ధర్నాకు మద్దతు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల17 నుంచి ఆమరణ దీక్ష చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
—————