ఉరితో ఊపిరి పీల్చుకోవద్దు.. భద్రతను పటిష్ఠపర్చాలి

అజ్మల్‌ కసబ్‌.. ఈ పేరు తెలియని వారు బహుశా దేశంలో ఉండరేమో. ఎందకంటే, అతను సాగించిన మారణకాండను ఏ భారతీయుడు అంత సులువుగా మరిచిపోలేడు. నవంబర్‌ 26, 2008లో ముంబయ్‌ మహానగరంలో ఉగ్రవాద బృందం జరిపిన దాడిపై అజ్మల్‌ సభ్యుడు. పోలీసులకు సజీవంగా చిక్కిన ఏకైక ఉగ్రవాది. ఇంతకు ముందే అతన్ని విచారించిన ప్రత్యేక కోర్టు ఉరి శిక్షను విధించింది. కానీ, ఆ రక్తపిపాసి తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భారత అత్యున్నత న్యాయస్థానం కూడా అతనికి ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. దేశంపై యుద్ధం, ఉగ్రవాదం, మారణకాండ, కుట్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కసబ్‌కు ఉరే సరైన శిక్షని తన తుది తీర్పులో పేర్కొంది. అజ్మల్‌ కసబ్‌పై పోలీసులు 11 వేల పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. 3,192 పేజీల సాక్ష్యాధారాలను ప్రత్యేక న్యాయస్థానం పరిశీలించింది. 658 మంది సాక్షులను విచారించారు. వారిలో 30 మంది కసబ్‌ను గుర్తించారు. వీరిలో ఓ పదేళ్ల చిన్నారి కూడా తనపై కసబ్‌ దాడి చేశాడని కోర్టుకు తెలిపింది. కసబ్‌కు వ్యతిరేకంగా వాదించిన ఉజ్వల్‌ నికమ్‌ 1015 పత్రాలను కోర్టుకు సమర్పించారు. అంతే కాకుండా, ఎఫ్‌బీఐ అధికారులు సాంకేతిక ఆధారాలను కోర్టుకు అందించారు. ఎన్‌ఎస్‌జీ కమెండోలు కూడా సాక్ష్యం చెప్పారు. దాడి జరిగిన ప్రదేశాల్లోని సీసీ టీవీ కెమెరాలు కూడా కసబే దోషి అని నిరూపించాయి. అంతే కాకుండా, అప్పటి ఎస్టీఎఫ్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే మృతదేహం నుంచి వెలికితీసిన బుల్లెట్లను, కసబ్‌ డీఎన్‌ఏను పరీక్షించగా, ఆ బుల్లెట్లు కసబ్‌ తుపాకీ నుంచి వచ్చినవేనని స్పష్టమైంది. ఇంత విచారణ జరిగాక ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పు కసబ్‌కు ఉరేనని నిర్ధారించాక, వీటన్నింటినీ పరిశీలించిన సుప్రీం కోర్టు కూడా ఆ కసాయికి ఉరిశిక్షను ఖరారు చేసింది. కసబ్‌ పట్టుబడ్డ 3 సంవత్సరాల 9 నెలల 3 రోజులకు సుప్రీం తన తీర్పు ను వెలువరించింది. ఏదేమైనా భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసేందుకు ప్రయత్నించి, 166 మంది మరణానికి, 308 మందికి పైగా క్షతగాత్రులవడానికి కారకుడైన అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష విధించడంపై దేశం మొత్తం హర్షం వ్యక్త చేస్తున్నది. కానీ, ఇక్కడ అత్యున్నత తీర్పు మరో ప్రశ్ననూ లేవనెత్తింది. అదే దేశం ఎంత భద్రంగా ఉందని. దేశ వాణిజ్య రాజధానిగా పిలువబడే ముంబయ్‌ మహా నగరానికి ఉగ్రవాదులు ఆనాడు అవలీలగా చొరబడ్డారు. పోలీసు నిఘా వర్గాల కన్నుగప్పి గస్తీ నిర్వహించారు. అన్ని భద్రతా ఏర్పాట్లను ఛేదించుకుని తమ లక్ష్యాలకు చేరుకున్నారు. చివరికి ఒక్క కసబ్‌ తప్ప మిగతా వారు చనిపోవచ్చు గాక, కానీ, ఆ నరరూప రాక్షసులు అనుకున్నది సాధించారు. వందకు పైగా ప్రాణాలు తీయాలనుకున్నారు.. తీశారు. దేశంలో భయోత్పాతం సృష్టించాలనుకున్నారు.. సృష్టించారు. ఈ విధంగా మన దేశ వ్యవస్థ డొల్లతనాన్ని బహిర్గతపర్చారు. ఉగ్రవాదులు అప్పటికప్పుడు అనుకుని ముంబయ్‌లోకి చొరబడలేదు. కొన్ని వారాలపాటు కసరత్తు చేశాయి. ముంబయ్‌ అంతా వాళ్ల నెట్‌వర్క్‌ కలియదిరిగింది. లక్ష్యాలను నిర్దేశించింది. హంతకులకు దిశానిర్దేశం చేసింది. ఆ తరువాత తమ మారణకాండ సాగించడానికి నవంబర్‌ 26, 2012వ తేదిని ముహూర్తంగా నిర్ణయించుకుని ఆ ఘోర ఆకృత్యానికి పాల్పడింది. ముంబయ్‌పై దాడి జరగడానికి ముందు ఇంత తంత్రం రచన జరుగుతున్నా, భారత నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి ? ఎందుకు ఉగ్రవాదుల దాడిని ముందే గుర్తించలేకపోయాయి ? నివారణ ఎందుకు చేపట్టలేకపోయాయి ? నూరు కోట్ల మంది భద్రతలను విస్మరించాయా ? అన్న ప్రశ్నలు ఆ దాడితో ప్రతి భారతీయుడి మదిలో మెదిలాయి. ఇప్పుడు కసబ్‌కు ఉరి పడిందని ఊపిరి పీల్చుకోవడం కాదు చేయాల్సింది.. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. డొల్లతనాన్ని పూడ్చుకోవాలి. శత్రువుల కదలికలను పసిగట్టాలి. వారి దాడి వ్యూహాలను తిప్పికొట్టాలి. మళ్లీ ముంబయ్‌ తరహా మారణకాండ జరుగకుండా చర్య తీసుకోవాలి.