ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌25: జిల్లాలో తీవ్రంగా ఎండలు ఉండడం, వడగాలులు వీయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైద్యుల సలహాతో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌  జగన్మోహన్‌ తెలిపారు. రాష్ట్రంపాటు జిల్లాలో ఉష్ణ తీవ్రతను  దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తం అయ్యారు. డయేరియా లాంటి వ్యాధులు విజృంభించనుండంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక్కడ ఎలాంటి కేసులునమోదు కాకున్నా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. దీనికి తోడు అధికారలు ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. వడదెబ్బ తదితర  వ్యాధులనకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అధిక  ఉష్ణోగ్రతల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలుస్తుడటంతో  ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం ఆసుపత్రులకు వస్తున్నవారిలో వడదెబ్బతో వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎండల తీవ్రతకు తోడు  వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వీటితోపాటు ఉత్తరాది నుంచి వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించారు. జిల్లాలో మెరుగైన వైద్యచికిత్సకు కీలకమైన రిమ్స్‌ తో పాటు జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆసుపత్రుల్లో  మందులు, చికిత్స విధానం

అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఇదిలావుంటే జిల్లాలో వివిధ రకాల వ్యాధి నియంత్రణకు ప్రచారం చేపడుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి తెలిపారు.  రిమ్స్‌తోపాటు మంచిర్యాల, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, ఉట్నూరు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. . ఆయా ఆసుపత్రుల్లో సరిపడ మందులు అందుబాటులో ఉంటాయన్నారు.  పాఠశాల విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో క్షేత్రస్థాయి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్సలు అందించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మురికివాడలలో నివసిస్తున్న ప్రజలకు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించాలని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు నిల్వ ఉంచి చికిత్స అందించాలని  పేర్కొన్నారు.