ఎగిసిపడ్డ ఉద్యమ కెరటం
నిలువెత్తు గాయాలకు సాక్ష్యం
తెలంగాణ ఉద్యమ పోరులో ‘ఆర్ట్స్’ కాలేజీ పెద్ద ‘ఫోర్స్’
తొలి మలి దశ ఉద్యమాల కేంద్రం
పేలిన తూటాలు, మోగిన భాష్పవాయు గోళాలు, విరిగిన లాఠీలు
చిమ్ముతున్న నెత్తురులో సింహాలైన లేసిన పోరు బిడ్డలు
దేశ ప్రధానితో సహా అనేక ఉద్యమ వీరులను మలచిన విద్యాలయం
ఆర్ట్స్ కళాశాల 75 వసంతాల సందర్భంగా ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, డిసెంబర్ 04 (జనంసాక్షి) : అది విద్యాభ్యాసానికి అనువైన కేంద్రం..! విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం. ఎప్పుడూ వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కోలాహలంగా ఓలలాడుతుంటుంది..!! అంతేకాదు.. తన విద్యార్థులందరికీ ఉగ్గుపాలు తాపించి వీరుల లక్షణాలు నూరిపోసింది. తద్వారా అనేక ఉద్యమాలు, పోరాటాలకు వేదికైంది..! అనేక సమరశీల పోరాటాలనూ నడిపిన చరిత్రను సొంతం చేసుకుంది..!! తుపాకి తూటాలు, భాష్పవాయు గోళాలు, పోలీసుల లాఠీలకు వెరవక అలవోకగా ఉద్యమాలను నడిపే నాయకత్వానికి పురుడుపోసింది..! ఇలా అనేక ఈ పోరాటాల్లో ఎందరో వీరులను చేసి వేనోళ్ల కీర్తించబడుతోంది..!! ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది. ఆంధ్రోళ్ల అంతుజూడ.. పిడికిలెత్తి.. గర్జించి.. గంతులేసే యువకిషోరాలను తెలంగాణ ఉద్యమంలో ముందుపీఠిన నిలిపింది..! అంతిమంగా తెలంగాణ సాధనలో విజయకేతనానికి సంకేతమైంది. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకుని వెెలుగొందుతోంది..!! ఇలా.. పోరాటాలకే పరిమితం కాకుండా దేశానికి అత్యున్నత స్థాయిలో సేవ చేసే శక్తిమంతుల్ని కూడా అందించింది. తన ఒడిలో విద్యనేర్చుకున్న పివి నర్సింహారావును దేశ ప్రధానిని చేసింది. మరెందరికో దేశ సేవలో భాగస్వామ్యం కల్పించింది. అదే.. మన ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కళాశాల. ఈ కళాశాల ఏర్పడి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.
విశాలమైన ప్రాంగణం యూనివర్శిటీ సొంతం…
ఉస్మానియా యూనివర్శిటీ మొత్తం 2,400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. క్యాంపస్ మొత్తం పచ్చని చెట్లు, చల్లటి గాలి, విశాలమైన ప్రాంగణాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో శోభిల్లుతోంది. ఆర్ట్స్ కళాశాలపై అందమైన శిల్పకళ కళ్ల చూపును ఇట్టే ఆకర్షిస్తుంది. అందం, నాణ్యతతో కూడిన నిర్మాణం అబ్బురపరుస్తుంది. ఒకప్పుడు అద్దెభవనంలో కొనసాగుతూ.. 25 మంది అధ్యాపకులు, 225 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ఆర్ట్స్ కళాశాల నేడు 25 విభాగాలు, 1,707 మంది పిజి విద్యార్థులు, 400 మంది పరిశోధకులతో బాసిల్లుతోంది. దీంతో యూనివర్శిటీ మొత్తం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో నిత్యం కిటకిటలాడుతూ ఒక పర్యాటక కేంద్రాన్ని తలపిస్తోంది.
పోరాటాల అడ్డ యూనివర్శిటీ గడ్డా…
దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీషు దొరలకు వ్యతిరేకంగా భారతీయులు సాగించిన పోరాటాల్లో వందేమాతర ఉద్యమం ఒక కీలక ఘట్టం. అలాంటి గొప్ప చరిత్రను సొంతం చేసుకున్న వందేమాతర ఉద్యమానికి ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కళాశాల కేంద్రబిందువైంది. నాటి తెల్లదొరల రాజ్యానికి వ్యతిరేకంగా నడిపించిన పోరాటాల నుంచి ఇటీవల ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ ఉద్యమం వరకూ మలి, తుది దశల్లోనూ ఉస్మానియా విశ్వవిద్యాలయం పోరాటాలకు అడ్డాగా మారింది. ఇక్కడ చదువుకుని.. నాటి వందేమాతరం పోరాటంలో పాల్గొన్న వారు.. భారత మాజీ ప్రధాని పివి.నర్సింహారావు, ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డి వంటి వారున్నారు. 1969లో, 2009లో ఉవ్వెతున్న సాగిన తెలంగాణ ఉద్యమానికి ఆర్ట్స్ కళాశాల వేదికైంది. ఇలా ఒకవైపు చదువులు పంచుతూనే మరోవైపు మహత్తర ఉద్యమాలను నడిపింది.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు…
ఆంధ్రోళ్ల దోపిడీ, పక్షపాత పాలనను సహించలేని తెలంగాణ విద్యార్థులు 1965లోనే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారు. అప్పట్లో ఈ ఉద్యమం 1969 నాటికి తీవ్రరూపం దాల్చింది. వందల మంది విద్యార్థులు అప్పట్లో పోలీసుల తూటాలకు, లాఠీలకు బలయ్యారు. ఈ ఉద్యమం ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా యావత్ తెలంగాణ మొత్తం విస్తరించింది. ఆ తర్వాత కొంత తగ్గి మళ్లీ కెసిఆర్ నాయకత్వాన తెలంగాణ ఉద్యమం రాష్ట్రం నలుమూలలకూ వ్యాపించింది. 2009లో ఈ ఉద్యమం మరింత కీలక దశకు చేరింది. ఊరూరా తెలంగాణ వాదాన్ని వినిపించింది. ఈ క్రమంలో ఆంధ్రా పాలకులు యూనివర్శిటీ విద్యార్థులపై అనేక సార్లు పోలీసులతో లాఠీఛార్జీలు చేయించారు. పలుమార్లు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. చివరికి తుపాకి తూటాలను సైతం మోగించారు. తెలంగాణ పోరాటంలో అనేక సందర్భాల్లో 1200 మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
యూనివర్శిటీలో చదివి.. ప్రముఖులైనవారు…
ఉస్మానియా యూనివర్శిటీలో విద్యనభ్యసించి దేశంలో వివిధ రంగాలు, వివిధ స్థాయిల్లో సేవలందించిన వారు, అందిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కొందరు ప్రముఖ బాధ్యతల్లో ఉన్నారు. మహ్మద్ రజీ-ఉద్దీన్-సిద్ధిఖీ ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయ్యారు. అదేవిధంగా నోబెల్ బహుమతికి నామినీ చేయబడినారు. పివి.నర్సింహారావు భారత ప్రధానిగా గతంలో సేవలందించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టినవే. వేణుగోపాల్‌రెడ్డి రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు. సయ్యద్ అలీ మహ్మద్ ఖుస్రో ఆర్థిక వేత్త, జర్మనీ మాజీ రాయబారిగా పనిచేశారు. హరూన్ సిద్ధిఖీ కెనడాలో భారత పాత్రికేయుడుగా ఉన్నారు. రాములు కొమిరెడ్డి జర్నలిస్టుగా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఎంపిగా కొనసాగుతున్నారు. ఆచార్య అఫ్జల్ మహ్మద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉపసంచాలకులుగా ఉన్నారు. శ్యాంబెనగళ్ భారత సినిమా దర్శకులుగా ఉన్నారు. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షబోగ్లే, విప్లవ కవి వరవరరావు, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రముఖ ఆర్థికశాస్త్ర నిపుణులు మాథూర్, గతంలో ప్రధాని కార్యాలయంలో పనిచేసిన సంజయ్‌బారు, పద్మభూషన్ ఎస్.కె.కుమార్, ప్రస్తుతం ఎంపిగా కొనసాగుతున్న బాల్కసుమన్.. ఇలా ఎందరో రాజకీయ, ఆర్థిక, సామాజిక వేత్తలుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
దేశంలోనే ఉత్తమ యూనివర్శిటీగా పేరు…
హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఈ యూనివర్శిటీ దేశంలోనే మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. భారతదేశంలో ఉన్నత విద్యావ్యాప్తిలో ఉస్మానియా యూనివర్శిటీ 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారత దేశంలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదరాబాద్ సంస్థానంలో స్థాపించిన మొట్టమొదటి విద్యాసంస్థ. దేశంలో ఉన్న మొత్తం 150 యూనివర్శిటీలపై ఇండియాటుడే పత్రిక సర్వే నిర్వహిస్తే.. 2010లో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012లో 6వ స్థానంలో యూనివర్శిటీ నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లోని యూనివర్శిటీల్లో ఉస్మానియా యూనివర్శిటీ మొదటి స్థానంలో ఉన్నట్లు తేలింది. ఇలా భవిష్యత్‌లోనూ మరింత పురోగతి సాధించి ఉన్నత విద్యాప్రమాణాలను పాటించి ప్రపంచానికే మార్గదర్శకం కావాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రం పేరుప్రఖ్యాతలు విశ్వమంతా తెలియజేయాలని, అందుకు ప్రభుత్వం కూడా తగినన్ని నిధులు వెచ్చించి యూనివర్శిటీ అభివృద్ధికి పాటుపడాలని, పడుతుందని.. ఆకాంక్షిద్దాం.. ఆశిద్దాం.