ఎట్టకేలకు మోడీకే ప్రచార బాధ్యతలు

పనాజీ, జూన్‌ 9 (జనంసాక్షి) : 
ఎట్టకేలకు గుజరాత్‌ ముఖ్యమత్రి నరేంద్రమోడీకి బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా మోడీని నియమించారు. పనాజీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు రోజు ఆదివారం ఈ ప్రకటన చేశారు. మోడీనే నియమిస్తారనే ప్రచారం మొదటి నుంచి సాగినా అగ్రనేత లాల్‌ కృష్ణ అద్వానీ అనుకూలంగా లేకపోవడంతో కొంత సస్పెన్స్‌ కొనసాగింది. శనివారం మోడీ పదాధికారుల సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా, అద్వానీ రాకపోవడంతో ఆయన ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. ఆదివారం కూడా అద్వానీ రాకపోవడంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం మోడని ప్రచార కమిటీ చైర్మన్‌గా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఆయన ప్రకటన చేసినప్పుడు పక్కన లోకసభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ ఉన్నారు. ఆమె అద్వానీ వర్గంగా ముద్రపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రచార కమిటీలో పదకొండు మంది సభ్యులు ఉంటారు. అద్వానీ విషయంలో ఇంతకాలం తర్జనభర్జనలకు ఇక తెరపడింది. దీంతో మోడీ ఇక పార్టీ ప్రచార బాధ్యతలను నెత్తికెత్తుకుంటారు. అయితే ఇప్పటికే అద్వానీ నాయకత్వంపై ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్రుగా ఉంది. మోడీకి బాధ్యతలు అప్పగించడంలో నాగ్‌పూర్‌ టీమ్‌ బాగా పనిచేసిందనే చెప్పాలి. బిజెపి మొదటిసారి ఓ బిసి నేతను అందలం ఎక్కించింది. మోడీకి ఆర్‌ఎస్‌ఎస్‌ గట్టిగా మద్దతు పలుకుతోంది. అద్వానీ లేకపోయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌తోనే మోడీని ప్రకటించినట్లుగా చెబుతున్నారు. మోడీకి బాధ్యతలు అప్పగించడం పట్ల అద్వానీతో పాటు ఆయన వర్గం కినుక వహించింది. మరోవైపు మోడీకి పలువురు అభినందనలు తెలియజేశారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే మోడీకి ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించామని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. తొమ్మిదేళ్ల యూపీఏ పాలనలో ధరలు పెరిగాయని, సామాన్యుల జీవితం దుర్భరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. యూపీఏ పాలనలో కరెంటు ఖాతా లోటు నియంత్రణలో లేదని ఆరోపించారు. మాల్దీవులు లాంటి చిన్న దేశాలు కూడా భారత్‌ మాట వినట్లేదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో దేశ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైఫల్యాలు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్తామని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. అయితే మోడీని చూసి కాంగ్రెస్‌ పార్టీ భయపడుతోందని రాజ్‌ నాథ్‌ సింగ్‌ అన్నారు. ఇదిలావుంటే దేశ ప్రజల నమ్మకాన్ని కాంగ్రెసు పార్టీ, యూపిఏ ప్రభుత్వం కోల్పోయిందని మోడీ అన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఈ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ కలగలాని ఆయన అన్నారు. దేశానికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తే తప్ప విముక్తి లేదన్నారు. తనకు కొత్త బాధ్యత అప్పగించిన భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన కార్యకర్తలకు ఈ గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించారు. బిజెపి కార్యకర్తలపై తనకు పూర్తి నమ్మకముందన్నారు. నాయకులు రాజకీయ జీవితం, అధికారాన్ని ప్రజల సేవకు వినియోగించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి రాజ్‌నాథ్‌సింగ్‌ కలలను నిజం చేద్దామని కార్యకర్తలకు మోడీ పిలుపునిచ్చారు. ప్రచారం కోసం కాంగ్రెస్‌ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో మృతి చెందిన జవాన్లకు సంతాపం తెలపాలన్న ఆలోచన ప్రధానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇదిలావుంటే మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించడంపై బిజెపి శ్రేణుల్లో ఆనంతం వ్యక్తం అవుతోంది